15 July, 2026 | 1:46 AM

విద్యార్థి లోకానికి అండగా ఏబీవీపీ పోరాటం

15-07-2026 01:42 AM

కేసముద్రం, జూలై 14 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మండల వ్యాప్త పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏబీవీపీ మండల నాయకులు నునవత్ గణేష్, చిత్తరి చాణక్య, బానోత్ సురేందర్, ధరవత్ నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అవి ప్రభుత్వం పెట్టే భిక్ష కాదని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు.   ఫీజులు అందక వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం ఏబీవీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.