16 July, 2026 | 2:20 PM

గంగారెడ్డి హత్య కేసులో నిందితుడికి రిమాండ్

26-10-2024 01:30 AM

కరీంనగర్, అక్టోబరు 25 (విజయక్రాంతి): జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడైన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యకేసులో నిందితుడు సంతోష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాలు.. 15 సంవత్సరాలుగా గంగారెడ్డి, సంతోష్‌ల మధ్య భూ వివాదం కొనసాగుతుండగా.. గంగారెడ్డిపై శతృత్వాన్ని పెంచుకున్న సంతోష్.. అతడిని హతమార్చేందుకు ప్ల్లాన్ చేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఈనెల 22న జాబితాపూర్‌లో అద్దెకు తీసుకున్న కారుతో  సంతోష్ వెంబడించి మరీ గంగారెడ్డి బైక్‌ను ఢీకొట్టాడు. గంగారెడ్డి కిందపడిపోగా వెంట తెచ్చుకున్న కత్తితో అతడిపై దాడిచేశాడు. ఈ సమయంలో స్థానికులు అటుగా రావడాన్ని చూసి మొబైల్, కారును అక్కడే వదిలి సంతోష్ పారిపోయాడు. దాడికి సంబంధించిన దృ శ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యా యి. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలించి ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశారు.