16 July, 2026 | 1:58 PM

హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం

16-07-2026 01:56 PM

హైదరాబాద్: పాతబస్తీలో ఉన్న సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్ చేశారు. సైదాబాద్ సక్సెస్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం, రాయమని యాజమాన్యం ఆదేశించడం, పిల్లలకు ఇచ్చిన హోంవర్క్ లో కల్మా, సూరా అల్-ఫాతిహాలను నేర్చుకోవాలని సూచించడం బాధాకరమని మండిపడ్డారు. హైదరాబాద్ లో మత మార్పిడికి ప్రయత్నం జరుగుతుందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులని విమర్శించారు. మీ బుజ్జగింపు రాజకీయాలు, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ వంటి వ్యాఖ్యలే ఇటువంటి తీవ్రవాద శక్తులకు ధైర్యాన్ని ఇచ్చాయి.

రెండవ తరగతి పిల్లలతో బలవంతంగా కల్మా రాయిస్తున్నారని తెలుసుకుని, పాఠశాలను నిలదీసిన ఆ చిన్నారి తల్లి ధైర్యానికి తను జోహార్లు తెలిపారు. ఈ ఘటన తీవ్రమైనదైనప్పటికీ, పాఠశాల యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి ఇలా ఉందని రాంచందర్ రావు ఆగ్రహించారు. హిందూ విద్యార్థులు, వారి కుటుంబాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం కళ్ళు మూసుకుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించడమే కాకుండా, తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు.