బడిఈడు పిల్లలు బడిలో ఉండాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సిఫాబాద్ మండలం పాడిబండ గ్రామ పంచాయతీ పరిధిలోని వట్టివాగు గ్రామంలో ఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆత్రం ఈశ్వరి దినకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌పి రాథోడ్ రవీందర్, ఉపాధ్యాయులు కుమరం మాధవరావు పాల్గొని గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సీఆర్‌పి రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలు, బడి బయట ఉన్న పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు గ్రామ మ్యాపింగ్ చేసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న బడిఈడు పిల్లల నమోదును కూడా చేపడతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు, సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తూ గిరిజన విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.






