28 July, 2026 | 12:10 PM

భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి

28-07-2026 11:39 AM

కరెంటు లేక 5 గ్రామపంచాయితీ ప్రజల ఆందోళన

స్థలదాతకు న్యాయం చేయకపోవడంతో తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేత

శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్

కారేపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో నెలకొన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన భూయజమానికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడంతో వివాదం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఈ వివాదం కారణంగా పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయబడటంతో భాగ్యనగర్ తండా, పొలంపల్లి, ఉసిరికాయల పల్లి, గుట్టకింద గుంపు, అప్పైగూడెం పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ అవసరాలు, తాగునీటి సరఫరా, విద్యార్థుల చదువులు, చిన్న వ్యాపారాలపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా స్థలదాతకు న్యాయం చేస్తూ, సబ్‌స్టేషన్‌కు సంబంధించిన వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని విద్యుత్ శాఖ,రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను కోరారు. భవిష్యత్తులో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.