స్వార్జిత ఆస్తిని తల్లి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): స్వార్జిత ఆస్తిని పిల్లల్లో ఎవరికైనా గిఫ్ట్‌గా ఇచ్చే అధికారం తల్లికి ఉందని, దానిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరజాలరని హైకోర్టు స్పష్టంచేసింది. ఆస్తిపై హక్కులను ఆధారాలతో కోరాలని, అంతేగానీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో, ఊహాజనిత కారణాలతో దావాలు వేయరాదని సూచించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఇంటిలో మూడో వంతు వాటా ఇవ్వకుండా పెద్దకుమారుడి పేరు తో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయడాన్ని సమర్థిస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ భజరంగ్‌లాల్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1988లో తండ్రి ఇంటిని కొనుగోలు చేసి తల్లిపేరుతో రిజిస్టర్ చేశారని తెలిపారు. దీన్ని తల్లి మొదట ముగ్గురికీ పంచుతూ విల్డీడ్ చేసి, తరువాత దాన్ని రద్దు చేసి పెద్దకుమారుడి పేరుతో గిఫ్ట్ డీడ్ చేశారని చెప్పారు. ఇది కుటుంబ ఆస్తి అని అందులో మూడో వంతు తనకూ కేటాయించాలని కోరారు. తల్లి సుశీల్‌అగర్వాల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇల్లు సొంతంగా కొనుగోలు చేశారని, ఇందులో కొడుకులకు ఎలాంటి హక్కు లేదని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం సుశీల్‌అగర్వాల్ ఆస్తి నుంచి మూడో వంతు వాటా అడుగుతున్న భజరంగ్‌లాల్ అగర్వాల్ భిన్నమైన వాదనలు చేస్తున్నారని పేర్కొంది. వీల్‌డీడ్‌లో ముగ్గురికీ వాటాలు ఇచ్చినపుడు తల్లికి హక్కు లున్నాయని అంగీకరించి, గిఫ్ట్‌డీడ్ చేశాక తల్లికి హక్కులు లేవని భిన్నవాదనను తెరపైకి తెచ్చారంది.
ఇది కుటుంబ ఉమ్మడి ఆస్తి అని, తల్లి కనిపించే యజమానిగా మాత్రమే ఉన్నారని పిటిషనర్ పేర్కొంటున్నపుడు మొదట విల్డీడ్ చేసినపుడే దాన్ని రద్దు కోరాల్సిందని పేర్కొంది. అయితే అప్పుడు దాన్ని రద్దు కోరకుండా గిఫ్ట్‌డీడ్ చేసిన తరువాత తల్లికి హక్కులు లేవం టూ దాని రద్దు కోరడం చెల్లదంది. అంతేగాకుండా పిటిషనర్ ఈ ఆస్తిని ఉమ్మడి కుటుంబ ఆస్తిగా ప్రకటించాలన్న అభ్యర్థన చేయలేదని అంది. పరస్పర భిన్నమైన ప్రకటనలతో అదృష్టాన్ని పరీక్షించుకునేలా దావాను వేశారని పేర్కొంటూ పిటి షన్‌ను కొట్టివేసింది.






