దమ్ముంటే చలో పల్లె చేపట్టాలి
- రైతు సమస్యలు వదిలి అధిష్ఠానం మెప్పుకోసం సీఎం హస్తిన యాత్రలు: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కాక రగిలిపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి వారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలు చేయడమేమిటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. శుక్రవారం ఎక్స్ వేదిక స్పందిస్తూ ఆయనకు దమ్ముంటే చలో ఢిల్లీ కాదు, చలో పల్లె కార్యక్రమం చేపట్టాలని సవాల్ విసిరారు. ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో గాలి మాటలు చెప్పి, అధికారం చేపట్టిన తరువాత గాలిమోటర్లలో ఊరేగుతున్నారని, ఆయన యాత్రల తో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీలేదని పేర్కొన్నారు.
అధిష్ఠానం మెప్పుకోసం పగలు రాత్రి తపన తప్ప, అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా? అంటూ నిలదీశారు. రైతులకు మాయ మాటలు, ఢిల్లీ పెద్దలకు మూటలు అందజేస్తున్నారని ఆరోపించారు.
ఓఆర్‌ఆర్ లీజులో తప్పు జరిగితే చర్యలు తీసుకోండి
ఓఆర్‌ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటే జాలేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ లీజు విషయంలో తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ లీజును బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు ఓ సంస్థకు అప్పగించిందని రెవెన్యూ మంత్రి ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నిజంగానే తక్కువ ధరకు ఓఆర్‌ఆర్‌ను లీజుకు ఇస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దమ్ముంటే వాళ్ల ఆరోపణలు నిజమైతే వెంటనే ఆ లీజును రద్దు చేసి, కొత్త బిడ్‌లను పిలవాలని సవాల్ విసిరారు.






