20 May, 2026 | 5:14 AM

సివిల్ సూట్ల విచారణ పరిధి ఐటీడీఏ పీవోలకు లేదు

24-08-2024 03:30 AM
  1. ప్రభుత్వ ప్రతినిధులుగా కలెక్టర్లకే అధికారం
  2. ఏజెన్సీ ప్రాంతాల్లో వివాదంపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ సూట్లను విచారించే పరిధి ప్రభుత్వ అదనపు ఏజెంట్‌గా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)కి లేదని హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2002లో ప్రభుత్వం జారీచేసిన జీవో 193, 274 ప్రకారం ప్రభుత్వ ప్రతినిధిగా ఆ అధికారం కలెక్టర్లకే ఉందని స్పష్టంచేసింది. 2002లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంత సివిల్ సూట్లపై ప్రభుత్వ అదనపు ఏజెంట్‌గా విచారించే అధికారాన్ని ఉట్నూరు ఐటీడీఏ పీవోకి అప్పగిస్తూ అప్పటి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చట్టవిరుద్ధమని పేర్కొంది.

ఉట్నూరు ఐటీడీఏ పీవో వద్ద పెండింగ్లో ఉన్న సివిల్ సూట్లను ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్లకు బదలాయించాలని సూచించింది. వీటిపై తెలంగాణ ఏజెన్సీ నిబంధనలు-1924 ప్రకారం ప్రభుత్వ ఏజెంట్లుగా కలెక్టర్లు, ఏజెన్సీ డివిజనల్ అధికారు లు/ఆర్డీవోలు విచారణ చేపట్టాలని తేల్చిచెప్పింది. ఓ సివిల్ వివాదంలో డాక్యుమెంట్ల ను చేతి రాత నిపుణులకు పంపాలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉట్నూరు ఐటీడీఏ పీవో జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉట్నూరు మండలం హస్నాపూర్‌కు చెందిన చవన్ ప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై జస్టిస్ కే శరత్ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించారు. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్ ఉత్తర్వుల నేపథ్యంలో ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ల పరిధిలో దాఖలయ్యే ఏజెన్సీ ప్రాంతాల్లో భూబదలాయింపు నిబంధన, ఏజెన్సీ నిబంధనల కింద దాఖలయ్యేవాటిని ఐటీడీఏ పీవో విచారిస్తున్నట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. కలెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ప్రభుత్వ ఏజెంట్‌గా కలెక్టర్లకు ఉన్న అధికారాన్ని ఐటీడీఏ పీవోకు బదలాయించే అధికారం కలెక్ట ర్‌కు లేదని తెలిపారు. ఇది జీవో 193, 274కు విరుద్ధమని పేర్కొన్నారు.

గత ఆదిలాబాద్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరు ద్ధమని తీర్పులో పేర్కొన్నారు. గవర్నరు/ప్రభుత్వం అనుమతి లేకుండా సివిల్ సూట్లను విచారించే పరిధిని ఐటీడీఏ అధికారికి అప్పగించడం చెల్లదని స్పష్టంచేశారు.ఈ కేసులో ఉట్నూరు ఐటీడీఏ పీవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ కేసును కలెక్టర్‌కు బదలాయించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సూట్లను ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్లకు రెండు నెలల్లో బదలాయించాలని చెప్పారు. వాటిని ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి ఏజెన్సీ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల అమ లు నివేదికను తెప్పించి సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సూచించారు.