మహాలక్ష్మి మాన్ పవర్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్‌పై చర్యలు తీసుకోవాలి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇరిగేషన్ శాఖలో 68 ఉద్యోగాల పేరుతో ఇచ్చిన ప్రకటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏవో కిరణ్ కు వినతిపత్రం అందజేశారు.సీపీఎం నాయకులు మాట్లాడుతూ దినపత్రికలో మహాలక్ష్మి మాన్ పవర్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ అనే ఏజెన్సీ ఇరిగేషన్ శాఖలో 68 ఉద్యోగాలు ఉన్నట్లు ప్రకటన ఇచ్చిందన్నారు. ఈ ప్రకటన నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేసే విధంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఈ ప్రకటన ఇచ్చారని తెలిపారు.
ఉద్యోగాలకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన జీవో, రోస్టర్ విధానం, రిజర్వేషన్లు, జీతభత్యాలు వంటి ముఖ్యమైన వివరాలు ప్రకటనలో ఎక్కడా పేర్కొనలేదని పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలోని నిరుద్యోగులు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ ప్రకటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సంబంధిత ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ తరఫున అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తీక్, టికానంద్, మలశ్రీ తదితరులు పాల్గొన్నారు.




