కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడొద్దు : కేసీఆర్
04-07-2024 07:54 PM
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆర్మూర్, గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయిన కార్యకర్తలకు ఆయన ఏమాత్రం అధైర్యపడొద్దని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, అధికారం, ప్రతిపక్షం శాశ్వతం కాదని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కొనసాగించకపోవడం సమాజానికి నష్టం కలుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి చేయడమే మన కర్తవ్యమని కేసీఆర్ సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా తన దగ్గరకు రావొద్దని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గాల పేర్లు ప్రకటించినప్పుడే కార్యకర్తలు రావాలని చెప్పారు.






