22 August, 2026 | 6:52 PM

పూర్తి వివరాలు గడువులోగా ఇవ్వాలి

22-08-2026 06:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): సెన్సస్ హ్యాండ్ బుక్ తయారీకి సంబంధించి శాఖలవారీగా పూర్తి వివరాలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ లు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం సెన్సస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ప్రణాళిక శాఖ అందించిన ప్రామాణిక నమూనా ప్రకారం క్షేత్రస్థాయిలో అవసరమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రచురించే హ్యాండ్ బుక్ జిల్లా అధికారిక రికార్డుగా నిలుస్తుందని, శాఖల వారీగా ఇచ్చే గణాంకాలలోఎలాంటి తప్పులు లేకుండా పూర్తి కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. అలాగే సమాచారం పునరావృతం కాకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారులు ఒకరికొకరు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

అధికారులు సమర్పించే ఈ సమగ్ర నివేదికలు జిల్లా భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో సరిగ్గా చేర్చడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. సమాచార సేకరణ, నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, సిపివో గంగారెడ్డి, డీఈవో భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.