అంకెల గారడీలో ఆదివాసీ ఉనికి
మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వర్గం అభివృద్ధి చెందాల న్నా, వారికి రాజ్యాంగ ఫలాలు అందాలన్నా ప్రాథమిక ప్రాతిపదిక ‘జనాభా గణాంకాలే’. కానీ, తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన తెగగా ఉన్న ‘నాయక పోడు’ల విషయంలో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఆ జాతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నాయక పోడు తెగ జనాభా సుమారు 7 లక్షలకు పైగా ఉంటుంది.
ఈ మేరకు అనేక గిరిజన సంఘాలు, వివిధ ఎన్జీవోలు, వేదికల లెక్కలు తేల్చిచెప్తున్నాయి. కానీ, తెలం గాణ ప్రభుత్వం మాత్రం నాయక పోడు జనాభాను కేవలం 3,81,276కి సర్కారు పరిమితం చేసింది. అంటే దాదాపు సగానికి పైగా జనాభాను అధికారిక రికార్డుల్లో నుంచి అదృశ్యం చేసింది. ఇది సాధారణ విషయం కాదు. ఇది కేవలం సాంకేతికంగా జరిగిన పొరపాటో, గణాంకాల గందరగోళమో కానే కాదు, ఒక ప్రాచీన ఆదివాసీ జాతికి జరుగుతున్న చారిత్రక అన్యాయం. ఒక ఆదివాసీ తెగను నామరూపాల్లేకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రగానే భావించాల్సి ఉంటుంది.
నాలుగు తెగలు కలిపినా..:
తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల సామాజిక, ఆర్థిక వికాసానికి జనాభా లెక్కలే వెన్నెముక. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సమగ్ర సర్వే గణాంకాల ప్రకా రం.. సీరియల్ నెంబర్ 6 కింద ఉన్న గోండు, నాయక పోడు, కోయతుర్, రాజ్ గోండు వంటి నాలుగు ప్రధాన తెగలన్నిం టి జనాభా మొత్తం 3,81,276 (10.29 శాతం) ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఈ గణాంకాల్లోని అంతర్గత విభజనను లోతుగా పరిశీలిస్తే నాయక పోడు లకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోంది. వివిధ సామాజిక సర్వేలు, ఆదివా సీ సంఘాల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తం గా కేవలం ఈ ఒక్క తెగ జనాభా 7 లక్షల మార్కును దాటినప్పటికీ, నాలుగు తెగల ను కలిపి కూడా 3.81 లక్షలుగానే చూపించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమి టో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
జిల్లాల వారీగా గల్లంతు:
ప్రభుత్వ గణాంకాలు కేవలం ఐదు జిల్లాలకు పరిమితమై ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా (1,41,598), ఆసిఫాబాద్ (75,312), నిర్మల్ (35,938), నిజామాబాద్ (18,885), భూపాలపల్లి (14,774) జిల్లాల్లో మాత్రమే నాయక పోడుల ఉనికిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిం ది. ఈ ఐదు జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన 28 జిల్లాల్లో అసలు నాయక పోడు జనాభా లేదా? అనే సందే హం కలుగుతోంది. ములుగు, వరంగల్, ఖమ్మం, భద్రాచలం, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో వేల సం ఖ్యలో నాయక పోడు కుటుంబాలు నివసిస్తున్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నాయక పోడు తెగలవారు తరతరాలుగా కొండపోడు వ్యవసాయం చేస్తూ జీవినం సాగిస్తున్నారు. దాంతోపాటు తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి ఈ తెగ జనాభాను ఏ ప్రాతిపదికన విస్మరించారో అర్థం కావడం లేదు. పైన పేర్కొన్న జిల్లాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న నాయక పోడు తెగలవారిని సమ గ్ర సర్వేలో ఏ తెగ కింద పరిగణించారు? వారిని ఇతర తెగల జనాభాలో కలిపి చూపిస్తున్నా రా? లేదా వారిని అసలు గిరిజన తెగల కింద చూపించకుండా విస్మరించారా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఇతర తెగలలో విలీనం:
ఒకవేళ సమగ్ర సర్వేలో నాయక పోడుల జనాభాను ఇతర ఆదివాసీ తెగల్లో కలిపి చూపించి ఉంటే, అది వారి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తుంది. అలా చేయ డం వల్ల వారి ప్రత్యేక సాంస్కృతిక గుర్తిం పు ప్రమాదంలో పడుతుంది. ఆ తెగ ప్రజలకు మాత్రమే పరిమితమైన సంప్రదా యాలకు ముప్పు ఏర్పడుతుంది. ప్రతి ఆదివాసీ తెగకు ఒక ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, దైవారాధన, సామాజిక కట్టుబాట్లు ఉంటాయి.
నాయక పోడుల జనాభాను ఇతర తెగల్లో విలీనం చేయడం ద్వారా వారి స్వయంప్రతిపత్తిని, వారి అస్తిత్వాన్ని ప్రభుత్వం చెరిపివేస్తోంది. ఇది జనాభా లెక్కల తగ్గింపు మాత్రమే కాదు, ఒక తెగ ఉనికిని కాలరాయడమే. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తమ జనాభా ఎక్కువగా ఉందని డామినేట్ చేస్తున్న వర్గాల వల్ల నాయక పోడులు సామాజికంగా ఒంటరి అవుతున్నారు. తప్పుడు గణాంకాలు ఈ ఆధిపత్య పోరాటాలను మరింత పెంచి, నాయక పోడుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
రిజర్వేషన్లపైనా ప్రభావం:
జనాభా లెక్కల్లో జరిగే ఈ తప్పుల వల్ల అనేక దుష్పరిణామాలు తలెత్తుతాయి. ఈ పరిణామాలు నేరుగా ఆదివాసీ తెగ నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభా వం చూపుతాయి.
విద్యా, ఉద్యోగ అవకాశాలు: మన రాజ్యాంగం ప్రకారం జనాభా నిష్పత్తిలోనే రిజర్వేషన్లు దక్కుతాయి. 7 లక్షల జనాభా ఉన్న తెగను 3 లక్షలకు పరిమితం చేయ డం వల్ల, వారికి దక్కాల్సిన అవకాశాల్లో సగానికి పైగా కోత పడుతుంది.
రోస్టర్ విధానం: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో రోస్టర్ పాయింట్లు జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటాయి. తప్పుడు లెక్కల వల్ల నాయక పోడు అభ్యర్థులు తమకు రావాల్సిన సీట్లు, ఉద్యోగాలను శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉంది.
సంక్షేమ పథకాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో నూ ఈ తెగకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంది. ఎస్టీ ఉప ప్రణాళిక (టీఎస్పీ) కింద కేటాయించే నిధులు, జిల్లా స్థాయి సంక్షేమ పథకాలు అన్నీ జనాభా లెక్కల ఆధారంగానే మంజూరవుతాయి. జిల్లాలవారీగా జనాభాను గుర్తించకపోతే ఆయా ప్రాంతాల్లోని నాయక పోడులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందదు.
ప్రభుత్వ బాధ్యత తక్షణ చర్యలు:
జనాభా విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పటికే నాయక పోడు ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఈ సమస్య పరిష్కారం కోసం వారు కృషి చేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి తమ నిర సనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వే శాస్త్రీయంగా లేదని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్త వాలను అధికారులు విస్మరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో నే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎస్టీ కమిషన్‌ను కలిసి తమ నిరసన వ్యక్తం చేస్తామని నాయక పోడు ప్రతినిధులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలి.
పారదర్శక సర్వే: ఈ సర్వేలో చోటుచేసుకున్న తప్పిదాలు, పొరపాట్లను సరిది ద్దాల్సిన అవసరం ఉంది. గణాంకాలు వివాదాస్పదంగా మారిన జిల్లాలలో తక్షణమే పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో ‘రీ-సర్వే’ నిర్వహించాలి.
ఉప తెగల గుర్తింపు: సీరియల్ నెంబర్ 6లోని ఇతర తెగలతో కలపకుండా నాయ క పోడు జనాభాపై స్పష్టమైన గణాంకాలు వెల్లడించాలి.
ఎస్టీ కమిషన్ జోక్యం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి, జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ తెగలకు రాబోయే రోజుల్లో అన్యాయం జరగకుండా అడ్డుకోవాలి.
ఒక తెగ జనాభాను తక్కువగా చూపడమంటే ఆ తెగ భవిష్యత్తును అంధకారం లోకి నెట్టడమేనని చెప్పాలి. తెలంగాణలో రెండో అతిపెద్ద ఎస్టీ తెగకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని సరిదిద్దకపోతే, అది సామాజిక న్యాయానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది. నాయక పోడులు అడుగుతున్నది వారి ఉనికిని గుర్తించాలని మా త్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి వాస్తవ జనాభాను రికార్డుల్లో నమో దు చేయాలి. లేనిపక్షంలో, అస్తిత్వం కోసం ఆదివాసీ తెగల వారు చేసే పోరాటం ఉధృతమయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం లో ఏ ఒక్కరి హక్కు కూడా గణాంకాల గా రడీ వల్ల గల్లంతు కాకూడదని పాలకులు గుర్తించాలి.
వ్యాసకర్త సెల్: 9848559863
వెంకగారి భూమయ్య






