23 April, 2026 | 1:23 AM

భీకర పోరు తప్పదా?

23-04-2026 12:00 AM

పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరుపక్షాల మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణతో నిరవధికంగా ఆగిన ఈ యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ లక్ష్యం నెరవేరకపోవడంతో పశ్చిమాసియా మళ్లీ యుద్ధం ముంగిట నిలిచింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాల మధ్య రెండో విడత చర్చలు జరగకపోవడమే అందుకు ప్రధాన కారణం.

ఇరుపక్షాలకు ఒకరిపై మరొకరికి విశ్వాసం లేకపోవడం, పలు అంశా ల విషయంలో అంగీకారం కుదరకపోవడంతో తొలి విడత శాంతి చర్చలు ముందుకుసాగని విషయం విదితమే. రెండో విడత చర్చలు మాత్రం ఆదిలోనే ఆగిపోయాయి. ఇరుపక్షాలు కనీసం చర్చల వేదిక అయిన ఇస్లామాబాద్‌కు కూడా పయనం కాకపోవడం గమనార్హం. కాగా, శాంతి చర్చలు జరగకపోయినా తాత్కాలిక కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది.

అయితే, ఒకవైపు కాల్పుల విరమణను పొడిగిస్తున్నామని అంటూనే, మరోవైపు ఇరాన్ ఓడరేవు దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అగ్రరాజ్యం ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతు న్నాయి. యుద్ధం మొదటి పర్వంలో ఇరాన్ అగ్ర నాయకత్వం లక్ష్యంగా దాడులు జరిపిన అమెరికా, ఈసారి ఆ దేశ ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలపై గురిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

చమురు ట్యాంకర్లను అడ్డుకొని, ఇంధన సరఫరాను నిలువరిస్తే ఇరాన్‌కు ఆర్థికంగా భారీ నష్టం తలెత్తుతుందని, తద్వారా తన మాట నెగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్నది. అందులో భాగంగానే ఇరాన్ నౌకలను లక్ష్యంగా చేసుకొని ఓడరేవులను దిగ్బంధించింది. అమెరికా దిగ్బంధనాన్ని తీవ్రంగా పరిగణించిన ఇరాన్ దీటుగా ప్రతిస్పందిస్తోంది. అమెరికా సాయంతో హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న పలు నౌకలపై ఆ దేశం దాడులు చేసింది. వాటిలో గుజరాత్‌కు వస్తున్న ఓ నౌక కూడా ఉన్నట్టు సమాచారం. ఒకవైపు హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేయడం, మరోవైపు ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో మరోసారి భీకర యుద్ధం తప్పదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఈసారి యుద్ధ పరిణామాల తీవ్రతను అంచనా వేయలేం.