22 April, 2026 | 1:37 AM

అర్థశాస్త్రం అంటే..?

22-04-2026 12:00 AM

మనుష్యాణాం వృత్తిః అర్థః, 

మనుష్యవతీ భూమిరిత్యర్థః

తస్యాః పృథివ్యాః లాభపాలనోపాయః 

శాస్త్రమ్ అర్థశాస్త్రమ్ ఇతి!

(కౌటిలీయం  15

అర్థశాస్త్రం మనుష్య జీవితం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా అభివృద్ధి చెందాలి, పాలన ఎలా ఉండాలనే అంశాలపై సమగ్రమైన అవగాహన కల్పించే శాస్త్రం. మనుష్యు ల జీవనోపాధి ‘అర్థం’ అనబడుతుంది. మనుష్యులు జీవించడానికి అవసరమైన ‘భూమి’ కూడా అర్థమే. భూమి భౌతిక స్థలం మాత్రమే కాదు.. అది మానవ జీవనానికి ఆధారం, అభివృద్ధికి కేంద్రబిందువు. అందుకనే భూమిని పొందడానికి (లాభం), సక్రమంగా పాలించడానికి (పాలన) తగిన ఉపాయాలను చెప్పే శాస్త్రాన్ని అర్థశాస్త్రం అన్నాడు, ఆచార్య చాణక్య.

అర్థశాస్త్రం మను ష్య జీవనానికి అవసరమైన వనరుల సృష్టి, వినియోగం, పాలకుల నైతికత, రాజధర్మం, న్యాయపాలన, భద్రత, వ్యవసాయం, వాణి జ్యం సమాజ అభివృద్ధి, సుస్థిర పరిపాలన వంటి విభిన్న రంగాలను తనలో కలుపుకొంటుంది. ప్రజల సంతోషం, సంక్షేమం, రక్షణ లు లక్ష్యంగా పాలకులు భూమిపై ఆధిపత్యాన్ని సాధించాలి, దానిని సమర్థవంతంగా పాలించాలి. దీనికోసం అవసరమైన వ్యూహా లు, విధానాలు, నియమాలు క్రమపద్ధతిలో అర్థశాస్త్రంలో చర్చించబడ్డాయి.

ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి సారవంతమైన భూమి విస్తారంగా ఉంది. అయి తే ఆ భూమిని శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయానికి ఉపయోగించకపోతే, ప్రజలకు ఆహారం ఉండదు, ఉపాధి ఉండదు, సంపద సృష్టి జరగదు.. రాజ్యం బలహీనపడుతుంది. అలాకాక, పాలకులా భూమిని సమర్థులైన రైతులకు పంచి, సాగునీటి సదుపాయాలు కల్పించడం, పంటలకు సరైన ధరలు నిర్ధారించడం, పంటల నిలువ సదుపాయం, పంటలను అమ్ముకునేందుకు అంగడులను కల్పించడం, సరకు రవాణాకు అవసరమైన రహదారులను కల్పించడం వల్ల ప్రజలకు ఉపాధి పెరుగుతుంది, ఆహార భద్రత నిలుస్తుంది, సంపద సృష్టి జరుగుతుంది.

ఈ నేపథ్యంలో చూస్తే భూమిని అర్థంగా అనగా జీవనానికి ఆధారంగానూ,  వ్యవసాయం, వాణిజ్యాలను వృత్తి లేదా జీవనోపాధిగా నూ, పాలకులు తీసుకునే చర్యలను ‘లాభం’; ‘పాలన’కు ఉపాయాలుగానూ... అర్థశాస్త్రం చెపుతుంది. కేవలం భూమి లేదా సంపద ఉండటం సరిపోదు. దానిని సక్రమంగా వినియోగించడం, ప్రజల సంక్షేమం కోసం పాలించడమే ఆచార్య చాణక్యుడు చెప్పిన అర్థశాస్త్ర నిర్వచనం.

ఈ రోజుల్లో భూమి సంపాదన అనేది యుద్ధాల ద్వారా కాదు... అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక ప్రగతి, వనరుల సమీక రణ, వినియోగం, ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ద్వారా జరుగుతుంది. ఇదే చాణక్య చెప్పిన లాభం. అలాగే ప్రజలకు రహదారులు, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు, భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాపాడుతూ, ఆర్థిక వృద్ధిని సాధించడం సుపరిపాలన అనుకోవచ్చు. నిజానికదే అర్థశాస్త్ర ప్రయోజనం.

ఒక ప్రభుత్వం పెద్ద పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు) ఏర్పాటు చేసింది అనుకుందాం. దానితో ఉద్యోగాలు పెరుగుతాయి, ప్రజల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడకపోతే లేదా ప్రజల హక్కులను నిర్లక్ష్యం చేస్తే, ప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పాలించే పాలకులు అభివృద్ధి, సం క్షేమాల మధ్య సమతుల్యత పాటించకపోతే, రాజ్యంలో సంపద సృజింపబడినా, ప్రజల కు సుపరిపాలన అందదు.

సకాలంలో ప్రజాహితమైన, నిర్ణయాలు తీసుకోవడమే పాలనా దక్షతకు నిదర్శనం. నిర్ణయాలలో విలంబనం అనిశ్చితికి కారణమవుతుంది. ప్రమాదాలు లేకుండా సంపద సృష్టీ జరగదు. అయితే ప్రమాదాలు ఎదురవకముం దే వాటిని అంచనావేసి అప్రమత్తంగా ఉండడమే నాయకత్వ పటిమకు గీటురాయి. ముందుగానే సన్నద్ధతను కలిగి, అవసరమై న చర్యలను తీసుకున్నా సంక్షోభాలు ఎదురైతే, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. తరువాత చూద్దాంలే అనే అలసత్వ ధోరణి ప్రమాదాల తీవ్రతను పెంచుతుంది.

ఒక తుమ్మెద కమలంలోని మధువును గ్రోలి మత్తిల్లి అందులోనే ఉండిపోయింది. మెలుకువ వచ్చేవరకు కమలం ముడుచుకుపోయి అందులో బంధీ అయింది. అప్పుడ ది... రాత్రి గడుస్తుంది.. ఉదయమవుతుంది.. సూర్యుడొస్తాడు.. కమలం వికసిస్తుంది.. నేను ఎగిరిపోతాను అనుకున్నదట. ఆ సమయంలో ఒక ఏనుగు వచ్చి ఆ కమలాన్ని పెరికి నేలపైకేసి కొట్టిందట.. తుమ్మెద ఆశలు అడియాసలై ప్రాణాలు పోగొట్టుకుంది. ‘రేపు ఉదయమవుతుంది, కమలం వికసిస్తుంది’ అనే తేనేటీగ భావన భవిష్యత్తుపై నమ్మకం.

ఈ భావన అర్థశాస్త్రంలో సమంజసమే. పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టే టప్పుడు లేదా వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించేటప్పుడు, లేదా వినియోగదారులు ఖర్చు చేసేటప్పుడు.. అందరూ రేపటి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయనే నమ్ముతారు. భవిష్యత్తుపై ఆశ లేకపోతే ప్రస్తుత చర్యలు నిలిచిపోతాయి. ఆర్థిక వ్యవస్థలో నమ్మకం అత్యంత కీలకమైనది. మార్కెట్‌లో నమ్మకం పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి, సమృద్ధి పెరుగుతుంది. అదే నమ్మకం లేకపోతే ఆర్థిక వ్యవస్థ ముందుకు కదలదు.

పై ఉదాహరణలో తేనెటీగది అంధవిశ్వాసం. కానీ, మనుష్యులలో ఆర్థిక నిర్ణయా లు.. సముచిత విశ్లేషణ, నమ్మకమైన సమాచారం, అనుభవం ఆధారంగా ఉండాలి. అంధ విశ్వాసాలు, హేతువులేని ఆశావాదం ప్రమాదకరం. ఆశ, వివేకం, జాగ్రత్తలు కలిసినప్పుడు మాత్రమే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పటికప్పుడు తీసుకోవలసిన చర్యలను తేనెటీగ వాయిదా వేయ డం వల్ల అనుకోని ఆపదలు (ఏనుగు వచ్చి కమలాన్ని పెరికేయడం) ఎదురయి ప్రాణాలనే పోగొట్టుకున్నది.

అవసరమైన నిర్ణ యాలను వాయిదా వేసుకునే మనస్తత్వం ప్రమాదకరం. ఇంకా సమయం ఉన్నది.. మార్కెట్ నిలకడగానే ఉన్నది.. మన సాంకేతికత రేపటి అవసరాలనూ తీరుస్తుంది.. అనే మనస్తత్వం వల్ల అవకాశాలు చేజారిపోతాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పోటీదా రుల వ్యూహాలు, నిర్వహణ ప్రణాళికాబద్ధంగా లేకపోవడం, మార్కెట్‌లో అనిశ్చిత స్థితి ఎల్లప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం అవకాశాలను దూరం చేస్తుంది. రేపు బాగుంటుందనేది ఆశావహ దృక్పథమే కావచ్చు కానీ, దూరదృష్టిలేని ఆశలు కల్లలుగానే మిగిలిపో తాయి. మంచి ఆలోచనను సకాలంలో ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం శూన్యమే.

కాలం అన్నిటినీ నియంత్రిస్తుంది. అవకాశాలను సృష్టిస్తుంది, నశింపజేస్తుంది కూడా. కాలాన్ని ఎవరూ అధిగమించలేరు. రేపు చూద్దాం అనుకుంటూ కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే, అనుకోని పరిణామాలు జరుగుతాయి.

పాలకుర్తి రామమూర్తి