ఆదివాసీలు చదువుపై దృష్టి సారించాలి
ఎస్పీ అఖిల్ మహాజన్
పోలీసుల ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
ఆదిలాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఆదివాసీలు తమ సాంప్రదాయా న్ని కాపాడుకుంటూ చదువు కోసం ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. మారుమూల ఆదివాసి గిరిజన గ్రామ ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని, చలి తీవ్రత దృష్ట్యా ఆదివారం సిరికొండ మండల కేంద్రం నుండి దాదాపు 20 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణించి కన్నాపూర్, కుంట గూడ, జెండా గూడ గ్రామాల లోని ఆదివాసీ లకు ఉచిత దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.
మొదటగా జిల్లా ఎస్పీ, ఉట్నూర్ అదనపు ఎస్పి కాజల్ సింగ్ లకు ఆదివాసీ లు ఘనంగా స్వాగతం పలికారు. అధికారులను గ్రామస్తులు శాలువా తో సత్కరించారు. అనంతరం ఆదివాసీలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీలు ఎలాంటి వైద్య సేవలకైనా నాటు వైద్యం కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలి సూచించారు. త్వరలో ఈ ఆదివాసి గూడాలలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. యువత కై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో 240 అభ్యర్థనలో రాగా సోమవారం నుండి వారికి మొదటి లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుంది.
యువత ముఖ్యం గా మాదకద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి తమ కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణం లో గ్రామాల సహకారం అందించాలని తెలిపారు. యువత మంచి విద్య తో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి గ్రామాల,ప్రజల అధివృద్ధికి సహాయ పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ఎస్‌ఐ పూజ, గ్రామ సర్పంచులు, మాజీ జెడ్పిటిసి, ఆదివాసి నాయకులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






