కిల్లర్ ఐడెంటిటీ కోసం సాహసాలు
స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషలను ఏది వదలకుండా మంచి అవకాశాలను అందిపుచ్చు కొంటూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజను సినిమాలున్నాయి. తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో నటిస్తున్న ఈ అమ్మడు తమిళ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందనే చెప్పాలి. ఇటీవల ‘గోట్’ చిత్రంలో ఓ చిన్న క్యామియోలో కనిపించిందీ భామ. తాజాగా ఆమె మలయాళంలో నటిస్తున్న తాజా సినిమా ‘ఐడెంటిటీ’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను బట్టి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని అఖిల్ పాల్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఒక నేరాన్ని కళ్లారా చూసిన త్రిష.. కిల్లర్ ఎవరో తేల్చే పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ మలయాళంలోనే ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. త్రిషకు ఇలాంటి సినిమాలు కొత్త కాకపోయినా ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.






