పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
కేర్ హాస్పిటల్స్ వైద్యుడు విఠల్‌కుమార్ సూచన
హైదరాబాద్, జూన్ 16(విజయక్రాంతి): వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కేర్ హాస్పిటల్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ పీడియాట్రిక్స్ అండ్ నియోనటాలజీ డాక్టర్ విఠల్ కుమార్ కేసిరెడ్డి సూచించారు.
ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభం వర్షాకాలంతో కలిసి రావడంతో పిల్లల్లో వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, కడుపు ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, డెంగ్యూ వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. వేసవి సెలవుల సమయంలో పిల్లల నిద్ర, ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పులు రావడం వల్ల స్కూల్స్ ప్రారంభమైన మొదటి కొన్ని వారాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. పిల్లలు మళ్లీ పాఠశాల జీవనశైలికి అలవాటు పడేలా తల్లిదండ్రులు ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
స్కూల్‌కి వెళ్లే పిల్లలు రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర తీసుకోవాలని చెప్పారు. ఉదయపు అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదని డాక్టర్ విఠల్ కుమార్ కేసిరెడ్డి పేర్కొన్నారు. ఇడ్లీ, దోసె, ఉప్మా, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషకాహారం పిల్లలకు రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుందన్నారు. అలాగే లంచ్ బాక్స్ లో సమతుల్య ఆహారం ఉండేలా చూసుకోవాలన్నారు.
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు కప్పుకోవడం వంటి అలవాట్లు నేర్పించాలని సూచించారు. భోజనం చేసే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లను నివారించవచ్చన్నారు. కలుషితమైన ఆహారం, నీటి వల్ల కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల పిల్లలు ఇంటి నుంచి తీసుకెళ్లిన శుభ్రమైన తాగునీటినే ఉపయోగించాలని సూచించారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు.






