17 June, 2026 | 1:37 AM

ఎరువుల ధరకు రెక్కలు.. రైతులకు చుక్కలు

17-06-2026 12:39 AM
  1. వానాకాలం సీజన్ కు ప్రారంభంకానున్న సాగు పనులు
  2. రైతులను దోచుకుంటున్న ఎరువుల వ్యాపారులు
  3. సింగిల్ విండోలు, ప్రైవేట్ దుకాణాల్లో యధేచ్చగా అదనపు వసూళ్లు
  4. పాత స్టాక్ కు కొత్త ధరల దెబ్బ
  5. రషిదులు ఇవ్వకుండానే విక్రయాలు!
  6. మోతె మండల వ్యాప్తంగా అన్నదాతల ఆవేదన
  7. పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

మోతె, జూన్ 16: మండలంలో వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులపై ఎరువుల అధిక ధరల పిడుగు పడింది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగగా, దానిని ఆసరాగా చేసుకొని మండలంలోని కొందరు ప్రైవేట్ డీలర్లు, విక్రయదారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.

నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరకే ఎరువులు విక్రయించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం దోపిడీ యధేచ్చగా సాగుతోంది. ప్రతి బస్తాపై రూ.150 నుంచి రూ.300 వరకు ఆదనంగా వసూలు చేస్తూ మండల రైతుల రెక్కల కష్టాన్ని దోచుకతింటున్నారు. మొత్తానికి ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతుల కళ్ళకు చుక్కలు కనిపిస్తున్నాయనేది అతిశయోక్తి కాదు.

పాత స్టాక్ కు కొత్త ధరలు: 

గత యాసంగి సీజన్ ముగిసే సమయానికి వ్యాపారుల వద్ద పిఎసిఎస్ గోదాములో నిలువ ఉన్న పాత స్టాక్ ఎరువుల బస్తాలపై పాత ధరలే ముద్రించి ఉన్నాయి. అయితే ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభం కాగానే ధరలు పెరిగాయనే నెపంతో ఆ పాత నిల్వలను సైతం పెంచిన ధరలకే విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం యూరియా బస్తా ధరలను రూ.266.50 గా నిర్ణయించింది. అయితే డిమాండ్ ఉన్న సమయంలో యూరియా కావాలంటే దానితోపాటు ఖచ్చితంగా ఏదో ఒక అవసరం లేని లిక్విడ్ లేదా కాంప్లెక్స్ ఎరువుల బస్తాను కొనాలంటూ డీలర్లు మెలిక పెడుతున్నట్లు పలువురు స్థానిక రైతుల ద్వారా తెలిసింది.

కాంప్లెక్స్ ధరల మోత....

కాంప్లెక్స్ ధరలు మోత మోగిస్తున్నాయి. 20:20:0:13, 10:26:26 వంటి కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాకు రూ.300 పైనే అదనపు భారం పడుతుంది. రైతులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా పిఓఎస్ మిషన్ ద్వారా రసీదు ఇవ్వాలి. కానీ మండలంలోని మెజారిటీ దుకాణాల్లో అదనపు ధరలు వసూలు చేస్తున్న కారణంగా రైతులకు ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. బిల్లు అడిగితే స్టాక్ లేదు పక్క దుకాణానికి వెళ్లండి అంటూ మొండి సమాధానాలు ఇస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్న రైతులు గత్యంతరం లేక అడిగినంత ధరలు చెల్లించి ఎరువుల బస్తాలను తీసుకువెళుతున్నారు.

తూతూ మంత్రంగా తనిఖీలు...

సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిఘా పెడతామని జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించిన క్షేత్రస్థాయిలో ఆ నిఘా ఎక్కడ కనిపించడం లేదనీ పలువురు అంటున్నారు. టాస్క్ ఫోర్స్ తనిఖీలు కేవలం మండల కేంద్రానికే పరిమితమయ్యానీ స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ డీలర్ల వద్ద సాగుతున్న ధరల దందాను అధికారులు అసలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఫర్టిలైజర్ షాపుల ముందు ఎరువుల నిల్వలు వాటి ధరల పట్టికను ఖచ్చితంగా ప్రదర్శించాలి, ప్రతి కొనుగోలుకు పిఓఎస్ బిల్లు ఇవ్వాలని నిబంధనలు ఉన్న మండలంలో ఈ నిబంధనలకు నీళ్లోదులుతున్నారని పలువురు అనుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అదనపు ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సు లను తక్షణమే రద్దు చేసి రైతులకు ఎరువుల ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

 నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా 

పాత స్టాక్ ఇ ప్పుడున్న రేట్లకు అమ్ముతున్నారని నా దృష్టికి రాలే దు. నా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా

అరుణ, ఏవో, మోతె