17 June, 2026 | 2:48 AM

అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

17-06-2026 01:35 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 16 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హులు, నకిలీ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా దాదాపు 24 సంవత్సరాల తర్వాత చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పష్టం అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బిఎల్‌ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సంద ర్భంగా నెల రోజల పాటు నిర్వహించే ఓటరు ప్రత్యేక సవరణ డ్రైవ్కు సంబంధించిన విధి విధానాలను వివరించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం జూన్ 25 నుండి ప్రారంభమై, జూలై 24 వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. బిఎల్‌ఓలు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ’హౌస్ టు హౌస్’ సర్వే నిర్వహిస్తారని ఓటర్ల వివరాలను పరిశీలించి అవసరమైన ఫారాలను అందిస్తారని వివరించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని క్షేత్రస్థాయిలోనే ’బిఎల్‌ఓ యాప్’ ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారని పేర్కొన్నారు.

ఈ సర్వేలో ప్రధానంగా 2002 నాటికి ఓటరుగా నమోదై, ప్రస్తుతం ఉన్న వారి వివరాలను ధృవీకరిస్తారని, ఒకవేళ 2002 నాటికి ఓటరు జాబితాలో పేరు లేకపోతే, వారిని తల్లి లేదా తండ్రి వివరాలతో మ్యాపింగ్ చేస్తారని స్పష్టం చేశారు. ఓటరు పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉంటే ఈ సవరణల ప్రకారం వాటిని సరిచేస్తారన్నారు. చనిపోయిన వారి పేర్లను, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను జాబితా నుండి తొలగిస్తారని తెలిపారు.

ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే, వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తారని, నోటీసు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ సరైన సమాధానం లేదా ఆధారాలు ఇవ్వకపోతే ఓటును తొలగిస్తారని చెప్పారు. తుది డ్రాఫ్ట్ జాబితాలో పేరు నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తామని, ఇందులో ఏవైనా లోపాలు కనిపిస్తే సంబంధిత ఆర్డీఓలు నోటీసులు జారీ చేస్తారని తెలిపారు.

క్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని, కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి లేదా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన వారు తమ అడ్రస్ మార్చుకోవడానికి ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన 13 రకాల గుర్తింపు కార్డులను ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. డ్రాఫ్ట్ రోల్ ప్రకటించే నాటికి ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన సమగ్ర ఓటరు జాబితా తయారీకి బిఎల్‌ఓలు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, ఆర్డీవోలు సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ వి రమేష్, పి వెంకటేశ్వర్లు తహసీల్దార్లు ఏఎల్‌ఎంటి లు సూపర్వైజర్లు, టెక్నికల్ తదితరులు పాల్గొన్నారు.