16 July, 2026 | 11:53 AM

కాలేజీల అఫిలియేషన్, సీట్లపై స్పష్టత కరువు!

04-07-2024 12:59 AM
  • నేటి నుంచి ఎప్‌సెట్ కౌన్సిలింగ్ 
  • 8 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు.. 
  • 19న సీట్ల కేటాయింపు

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి):  టీజీ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇంత వరకు రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల అఫిలియేషన్ల ప్రక్రియనే పూర్తి కాలేదు. దీనికితోడూ సీట్లు కూడా ఖరారు కాలే దు. వీటిపై స్పష్టత లేకుండానే ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నారు. గురువారం నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. 19న మొదటి విడత సీట్లను కేటా యించనున్నారు. అఫిలియేషన్, సీట్లు ఖరారు,  9 వేల సీట్ల కన్వర్షన్‌పై స్పష్టత లేకుండానే కౌన్సిలింగ్ ప్రారంభించేస్తున్నారు.

ఉన్న సీట్ల వరకు అనుమతులు 

రాష్ట్రంలో 159 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1.10 లక్షల వరకు సీట్లు ఉన్నా యి. ఇవికాకుండా ఏఐసీటీఈ మరో 20 వేల వర కు సీట్ల పెంపునకు అనుమతినిచ్చింది. 159 కాలేజీల్లో 138 కాలేజీలు జేఎన్టీయూహెచ్ పరిధిలోనే ఉన్నాయి. ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చి న సీట్లు, కాలేజీల వివరాలను ప్రభుత్వానికి ఆయా వర్సిటీలు ఇప్పటికే పంపాయి. సీట్ల కన్వర్షన్‌ను ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడంపై ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఈక్రమంలోనే ప్రస్తుతం ఉన్న సీట్లు, కాలేజీల వరకు అనుమతులిచ్చి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు.   

కంప్యూటర్ కోర్సులుగా కన్వర్షన్ 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సుల్లో చేరేందుకు ఇష్టపడటం లేదు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ, అనుబంధ) కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెగ్యులర్ కోర్సుల్లోని సీట్లు మిగిలి పోతున్నాయి. దీంతో భర్తీకాని కోర్సుల సీట్లను సీఎస్‌ఈ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు కన్వర్షన్ చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు 9 వేల సీట్లను ఆయా కళాశాలలు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ విషయంలో అధికారులు సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. సంప్రదాయ కోర్సులను తగ్గించి సీఎస్‌ఈ కోర్సులకు అనుమతులిస్తే భవిష్యత్తులో సివిల్, మెకానికల్ రంగాల్లో ఉద్యోగుల కొరత ఏర్పడుతుందనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. ఈ నేపథ్యంలోనే కన్వర్షన్ అనుమతి విషయంలో సీట్లలో కోత విధించే అవకాశం ఉంది.

భారం తగ్గించుకునేలా 

ఏఐసీటీఈ ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు, సీట్లకు అనుమతినిస్తోంది. దీని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. కొత్తగా 20 వేల సీట్లు అందుబాటులోకి వస్తే ఆ సీట్లలో చేరే విద్యార్థులకు నిబంధనలు ప్రకారం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. దీనిపై ఆచితూచి అడుగులు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేలా ఆ భారం విద్యార్థులపైనే వేస్తే ఎలా ఉంటుందో యోచిస్తోంది. ఆ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ నెల 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ ప్రక్రియ ప్రారంభంలోపు కాలేజీల అఫిలియేషన్, సీట్ల ఖరారుపై స్పష్టత రానున్నట్టు సమాచారం.