అమరావతిపై శ్వేతపత్రం విడుదల..
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): అమరావతి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం సచివాలయంలో అమరావతి మీద శ్వేత పత్రం విడుదల చేసి.. మాట్లాడుతూ.. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదని యావత్ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని పాత వాటినే కొసాగిస్తూ నిర్మాణం చేస్తామన్నారు.
రాష్ట్ర భవిష్యత్‌ను ఆకాంక్షించే ఎవరైనాప అమరావతిని ఒప్పకోవాల్సిందేనని పునరుద్ఘాటించారు. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శిమరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని సీఎం గుర్తు చేశారు. ఇక్కడి రైతులు అమరావతి కోసం 34,400 ఎకరాలను ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూమితో కలిపి 53,745 ఎకరాలు సమకూరిందని, రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ప్రతిపక్ష ఉన్న సమయంలో జగన్ కూడా చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారన్నారు.
విభజన సమయంలో లోటు బడ్జెట్ ఉంది
విభజన సమయంలో ఏపీకి లోటుబడ్జెట్ ఉందని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సమయంలో అనేక మంది ముందుకు వచ్చారని తెలిపారు. జగన్ ప్రభుత్వం అమరావతిలో పనులన్నీ ఆపేసిందని దుయ్యబట్టారు. అమరావతిని విధ్వంసం చేసి తెలుగు జాతికి వైసీపీ ద్రోహం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతికి బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.






