2 June, 2026 | 1:18 AM

13 ఏళ్ల తర్వాత న్యాయమే గెలిచింది

02-06-2026 12:00 AM

విమలక్కకు న్యాయవాదుల ఘన సన్మానం

హైదరాబాద్, జూన్ 1:  2013 తెలంగాణ ఉద్యమ సమయంలో అలంపూర్ గ్రామంలోని మైనార్టీ ఇనాం భూములకు సంబంధించిన వివాదంలో నమోదైన కేసులో ఉద్యమకారిణి విమలక్కతో పాటు భూ హక్కుదారులైన ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగిందని న్యాయవాదులు పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన 13 ఏళ్ల విచారణ అనంతరం కోర్టు కేసును కొట్టివేయడంతో ఉద్యమకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఆ సమయంలో అలంపూర్ గ్రామంలోని సుమారు 195 ఎకరాల మైనార్టీ ఇనాం భూముల విషయంలో వివాదం తలెత్తగా, భూమి హక్కుల కోసం పోరాడిన విమలక్కతో పాటు ముస్లిం మైనార్టీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబడింది. అయితే విచారణలో ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించబడలేదని, దీంతో కోర్టు కేసును కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ రూమ్లో విమలక్కను అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ దూగుంట్ల శ్రీధర్ శాలువాతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి విప్లవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వోద్యరపు రవి, మాజీ ప్రధాన కార్యదర్శి పొన్నం దేవరాజు గౌడ్, సదానంద్, ఇతర కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సత్యం, న్యాయం చివరకు విజయం సాధించాయని, ఉద్యమాల కోసం పోరాడిన వారిపై నమోదైన తప్పుడు కేసులు నిలవవని పేర్కొన్నారు. విమలక్క చేసిన సామాజిక, ప్రజా ఉద్యమ సేవలను కొనియాడుతూ ఆమెకు అభినందనలు తెలిపారు.