అంతులేని అక్రమ నిర్మాణాలు!
- అడుగడుగునా కమర్షియల్ షెడ్ నిర్మాణాలు
- ముడుపుల మాయలో టౌన్ ప్లానింగ్ అధికారులు?
- మల్కాజిగిరి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి
- ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్‌నగర్ సర్కిళ్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకొని అధికారులు
ఎల్బీనగర్, జూన్ 1 : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎల్బీనగర్ జోనల్ పరిధిలో భారీ స్థాయిలో అక్రమ షెడ్లు, కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు జోరుగా సాగు తున్నాయి. సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయ త్‌నగర్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రోడ్ల వెంట, కాలనీల ముఖ్య కూడళ్లకు సమీపంలో కొందరు యథేచ్చగా కమర్షియల్ బిల్డింగ్, షెడ్లను నిర్మిస్తున్నారు.
రోజుల వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసి కిరాయిలకు ఇచ్చి లక్షల్లో సొమ్ము చేసుకుం టున్నారు. అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించకుండా కిందిస్థాయి సి బ్బంది, స్థానిక నాయకుల సాయంతో అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు, నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కండ్ల ఎదుట కనిపిస్తున్నా... కదలని అధికారులు
ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిళ్ల పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా... మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో లింగోజిగూడ, చంపాపేట, హస్తినాపురం, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఉమ్మడి డివిజన్ల పరిధిలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. హస్తినాపురం డివిజన్ లోని టీచర్స్ కాలనీ, జడ్పీ రోడ్డులో అనేక షెడ్లు నిర్మిస్తున్నారు.
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని సాగర్ కాంప్లెక్స్, ఎన్జీవో కాలనీలో అనుమతులు లేకుండా భారీ భవనాలను నిర్మిస్తున్నారు. హయత్ నగర్ డివిజన్ లోని విజయవాడ జాతీయ రహదారి ఇరువైపులా కమర్షియల్ షెడ్లు నిర్మిస్తున్నారు. ఆయా డివిజన్ల ప్రధాన రోడ్ల వెంట కొందరు ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే భారీ రేకుల షెడ్లు, కమర్షియల్ రేకులతో షాపులు నిర్మిస్తున్నారు. షెడ్లను కిరాయికి ఇచ్చి నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని తెలిసింది.
వీటిలో పలు రకాల వ్యాపార, వాణిజ్య లావాదేవీలు యథేచ్చగా కొనసాగుతున్నా.. రోడ్ల పక్కన వాటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమంగా నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణా సముదాయాల నుంచి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కు ఎలాంటి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా రావడం లేదు. వీటిని కట్టడి చేయడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది విఫలమవుతున్నారు.
అధికారులపై అవినీతి ఆరోపణలు
టౌన్ ప్లానింగ్ ఏసీపీ స్థాయి అధికారులు అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండా కింది స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తు న్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చైన్ మన్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అక్రమార్కులతో అంటకాగుతూ.... ప్రభుత్వానికి చేరాల్సి న ఆదాయాన్ని తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. సెల్లార్లు, అదనపు అంతస్తులు నిర్మి స్తున్న అక్రమార్కుల నుంచి రూ.లక్షల్లో అధికారులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడుతు న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ కట్టడాలను టీపీవో, చైన్ మన్ల పర్యవేక్షణలో విచారించి అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ, అక్రమ పూర్తయిన్నప్పటికీ ఏసీపీలు, టీపీవోలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






