మళ్లీ అధికారం మనదే
- పిచ్చి పనుల కాంగ్రెస్‌ను ప్రజలు ఛీ కొడతారు
- మరో 15 ఏళ్లు బీఆర్‌ఎస్‌దే అధికారం
- తెలంగాణ అభివృద్ధిలో జడ్పీ చైర్మన్ల పాత్ర కీలకం
- బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
- ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయ కులు పిచ్చిపిచ్చి పనులు చేసి ప్రజలతో ఛీ అనిపించుకునేలా ప్రవర్తిస్తారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత.. మళ్లీ ఇప్పుడు అలానే జరుగుతుందని చెప్పారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ జడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జడ్పీచైర్మన్లు రాష్ట్ర అభి వృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరో హించాలని అకాంక్షించారు. ప్రజాజీవితంలో ఒకసారి నిలిచిన తరువాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన రాజకీయ నాయకులని స్ఫూర్తినింపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్ని సవ్యంగా నడిచాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతోపాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు చెలరేగడం బాధ కలిగిస్తుందని చెప్పారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడు ఉన్నారు.. అయినా శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించాలని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని స్పష్టంచేశారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ, నాయకులు పార్టీని సృష్టించరని పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంచి యువ నాయ కత్వాన్ని తయారు చేస్తామని స్పష్టంచేశారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే అస హ్యించుకుంటారని చెప్పారు.
మీ స్థానాలకు ఢోకా లేదు
మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని కేసీ ఆర్ తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగవచ్చని పేర్కొన్నా రు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని ఈసారి బీఆర్‌ఎస్ తరుపున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్లదే విజయమని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.
ప్రస్తుతం ఉన్నవారి స్థానాలకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు. పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా కూడా పటిష్టంగా తయారు చేస్తామని అన్నారు. బంగ్లాదేశ్‌లో హష్మీ అనే ఒక ప్రొఫెసర్ పేద మహిళల కోసం 71 వేల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న విధా నం గురించి వివరించారు. జీరో పొల్యూషన్ నగరాల్లో అక్కడి మేయర్లు ప్రజల్లో మమేకమైన విధానం గురించి తెలిపారు.
జడ్పీ చైర్మన్లను సన్మానించిన కేసీఆర్
కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జడ్పీచైర్మన్లను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. వారిని పేరుపేరునా పలకరించారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకున్నందుకు అభినందించారు. అనంతరం కేటీఆర్ చైర్మన్ల కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు. భోజన సమయంలో అందరితో ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు. సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణరెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగ య్య, నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తారా?
రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని, తెలంగాణ తెచ్చినందుకు చెరిపేస్తారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చే నాటికి చెట్టుకొకడు, పుట్టకొకడు అయ్యాడనే బాధతో వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని రైతుబంధు పథకం అద్బుతంగా అందించమని వెల్లడించారు. ఇప్పడున్న ప్రభుత్వం రకరకాల కారణాలతో అసలు ఆ పథకానికి ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు లెక్కలు, ఇతరత్రా కారణాలు చూపుతూ రైతుబంధును అమలు చేస్తే అవినీతి మొదలైతుందని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కొంచెం ఓపిక పట్టాలని కోరారు.






