16 July, 2026 | 9:12 PM

సాగు సగం.. పంట ఆగం

03-07-2024 03:49 AM
  • జూలై ప్రవేశించినా ‘వర్షపాతం’ అంతంతమాత్రం 
  • మందకొడిగా వ్యవసాయ పనులు 
  • రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు 
  • వ్యవసాయశాఖ లక్ష్యానికి సుదూరంగా సాగు విస్తీర్ణం 
  • కేవలం బోర్ల కిందే వరి నారు మడులు 
  • ‘పత్తి’ నాటిన రైతుల క‘న్నీటి’ కష్టాలు 
  • పంటను కాపాడుకునేందుకు అన్నదాతల పాట్లు

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 2: ‘నైరుతి రుతుపవనాలు వచ్చినయి. ఇక వానలు సమృద్ధిగా కురుస్తయి. చెరువులు, వాగులు, ప్రాజెక్ట్‌లు నీళ్లతో నిండుతయి. ఇక దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చు..’ అని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. జూన్ 3న రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించగా, తొలకరి బాగానే కురిసింసింది. ఆ తర్వాత ఇక వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంటల సాగు మందగమనంలో పడింది. వర్షాలు వస్తాయని ఆశించిన కొందరు రైతులు పత్తి విత్తనాలు నాటి భంగపడ్డారు.

అవి మొలకెత్తక రంధి పడుతున్నారు. కొందరు పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెడతున్నారు. మరికొందరు డ్రిప్‌ను ఉపయోగిస్తున్నారు. కేవలం కొందరు రైతులు మాత్రమే బోర్ల కింద వరి నారు మడులు వేసుకుని సాగుకు సిద్ధమవుతున్నారు. జూలై ప్రారంభమయ్యే నాటిక భారీగా వర్షాలు కురిసి చెరువులు మత్తళ్లు తొక్కాల్సి ఉండగా, అది జరగలేదు. దీంతో చెరువులు బీడును తలపిస్తున్నాయి. రైతులు వాన జాడ కోసం మొగులు వంక చూస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో..

ఖరీఫ్‌లో భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా రైతులు 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటివరకు కేవలం 1.06లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభించారు. 95 వేల ఎకరాల్లో పత్తి చేస్తారని అంచనా వేయగా, దాదాపు లక్ష్యం పూర్తయింది. కానీ వానలు కురవకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో..

జిల్లాలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ ముగిసే నాటికి 170.2 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, అంతకంటే 6.9 మి.మీ తక్కువ నమోదైంది. వ్యవసాయశాఖ జిల్లావ్యాప్తంగా రైతులు 5,32,522 ఎకరాల్లో పంటల సాగు చేస్తారని అంచనా వేయగా, ఇప్పటి వరకు కేవలం 2,32,240 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇది వ్యవసాయశాఖ లక్ష్యంలో కేవలం 40శాతం మాత్రమే.

కరీంనగర్ జిల్లాలో..

జిల్లాలో జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 74.8 మి.మీ కాగా, అంతకంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రైతులు వరి నాట్లు సిద్ధం చేసుకున్నప్పటికీ వానజాడ లేకపోవడంతో చాలాచోట్ల నాట్లు ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా 2.74 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేయగా, జూన్  ముగిసే నాటికి కేవలం 10 వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. 48 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా,  కేవలం 16 వేల ఎకరాల్లోనే సాగు షురూ అయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 2.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీనిలో 1,82,000 ఎకరాల్లో వరి, 51 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేయగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయశాఖ అంచనాలో సగమైనా సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

కామారెడ్డి జిల్లాలో..

జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వయవసాయశాఖ అంచనా వేసిన లక్ష్యంలో రైతులు ఇప్పటివరకు కేవలం 10 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగు చేశారు. తొలకరి జల్లులకు మెట్టభూముల్లో పత్తి, సోయ, జనుము విత్తనాలు వేశారు.  అవి మొలకెత్తలేదు. బోరుబావుల కింద వరి తూకం పోసిన రైతులు వానలు లేకపోవడంతో నాటేందుకు జంకుతున్నారు. 

తక్కువ విస్తీర్ణంలో సాగు..

వర్షాభావ పరిస్థితులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాకాలంలో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతులు 3,18,965 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ సరిపిడినంత వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు 10 శాతం విస్తీర్ణంలోనే రైతులు పంటు సాగు చేశారు. వర్షాభావంతో కొందరు విత్తనాలు నాటేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. 

 భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కామారెడ్డి జిల్లా

ఒక్క గింజా మొలకెత్తలె

నేను ఐదెకరాల్లో వరి సాగు చేసేందుకు నారు మడి సిద్ధం చేశా. విత్తనాలు వేశా. మూడెకరా ల్లో పత్తి గింజలు నాటిన. వానజాడ లేకపోవడంతో వరి నారు ఎదగలేదు. ఒక్క పత్తి గింజైనా మొలకెత్తలేదు. అదును దాటి పోతున్నది. పత్తి విత్తనాలకు రూ.5 వేలు ఖర్చు పెట్టిన. భూమి దున్నించేందుకు కూలి ఖర్చులు ఇచ్చిన. చినుకు రాలడం లేదు. పెట్టిన ఖర్చులు సుత వస్తయో రావో అని రంధి పడుతున్న.

 మారగోని బాపు, రైతు, 

మహాముత్తారం, భూపాలపల్లి జిల్లా

కాలం వెనక్కిపోయింది..

వర్షాకాలంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వా నలు మంచిగ కురిస్తే దర్జాగా సాగు చేసుకోవచ్చనుకున్నాం. ఆశతో పత్తి విత్తనాలు నాటినం. వరి నారుమడులు సిద్ధం జేసి నం. జూలై మొదటి వారం వచ్చినా వాన లు కురవకపాయె. కాలం వెనక్కి పాయె. చినుకు జాడ కోసం ఎదురుచూస్తున్నం.

 ముదాం బాలమణి, 

రైతు, చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా