భారత్, అమెరికా మధ్య క్రిటికల్ మినరల్స్‌పై ఒప్పందం
- అరుదైన ఖనిజాల సరఫరాపై కూడా..
- ఇరు దేశాల చారిత్రాత్మక ముందడుగు
- ఎంవోయూలపై విదేశాంగ మంత్రులు జైశంకర్, రుబియో సంతకాలు
- న్యూఢిల్లీ వేదికగా ‘క్వాడ్’ సమావేశం సందర్భంగా నిర్ణయం
- ఖనిజాల సరఫరాలో చైనా ఏకఛత్రాధిపత్యానికి చెక్
న్యూఢిల్లీ, మే ౨౬: భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో మరో కీలక అడుగు పడింది. గ్లోబల్ టెక్నాలజీ, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైన క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు), రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన ఖనిజాలు) సరఫరాపై మంగళవారం ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా మంగళవారం జరిగిన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా (క్వాడ్) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి.
భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒప్పందాలపై సంతకాలు చేసి పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. దీంతో కీలక, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో చైనా విధిస్తున్న ఎగుమతి ఆంక్షలకు భారత్ చెక్ పెట్టినట్లయింది. తాజా ఒప్పందం ప్రకారం క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారం మరింత పటిష్టం కానుంది.
చైనా ఆధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేస్తూ గ్లోబల్ సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేసేలా సదస్సు నిర్ణయాలు తీసుకున్నది. దీంతో పాటు ఖనిజాల స్క్రాప్ నిర్వహణ కూడా సులభతరం కానుంది. ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వాణిజ్యపరంగా ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ ఒప్పందం పరిష్కారం చూపిస్తుందని ఆకాంక్షించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. రెండు దేశాల ప్రయోజనాలకు, ఇన్నొవేషన్ ఎకానమీకి తాజా ఒప్పందం ఊతమిస్తుందని అంచనా వేశారు.






