కార్మిక హక్కుల సాధన ఏఐటీయూసీ పోరాట ఫలితమే
17 ఏళ్ల తర్వాత 24 డిమాండ్లపై సానుకూల ఒప్పందం
భూపాలపల్లి, ఆగస్టు 30 (విజయ క్రాంతి): సింగరేణి కార్మికులకు భారీ ప్రయోజనాలు కల్పించేలా 17 ఏళ్ల తర్వాత అగ్రిమెంట్ సాధించామని, ఇది ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లిలోని ఏఐటీయూ కొమురయ్య భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కార్మికుల ఆర్థిక, ఉద్యోగ, వైద్య, విద్య, సంక్షేమానికి సంబంధించిన 24 అంశాలపై యాజమాన్యంతో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. 2009 నుంచి పెండింగ్‌లో ఉన్న పెర్క్స్ ఆదాయపు పన్ను రీఫండ్‌తో ఒక్కో కార్మికుడికి ఏడాదికి రూ.35 వేల వరకు లాభం చేకూరుతుందని, 2027 ఏప్రిల్‌లో ఖాతాల్లో జమ అవుతుందన్నారు. సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు, మృతుల పిల్లలకు ఉద్యోగం, ఎన్‌ఓసీ, ఇంక్రిమెంట్లు, క్యాడర్ స్కీమ్, క్లర్క్, సెక్యూరిటీ పోస్టుల సమస్యల పరిష్కారానికి అంగీకారం కుదిరిందన్నారు.
రిఫరల్ వైద్య ఖర్చులు కంపెనీ భరించడం, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, సీనియర్ మైనింగ్ సర్దార్లకు ప్రమోషన్లు, భూపాలపల్లి, శ్రీరాంపూర్, కొత్తగూడెంలో సీబీఎస్‌ఈ పాఠశాలలు, రిటైర్డ్ కార్మికుల వైద్య పరిమితి రూ.8 లక్షలకు పెంపు, ఓన్ హౌస్ స్కీమ్‌లో 200 గజాల స్థలానికి అంగీకారం లభించిందన్నారు. కొత్త గనులు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ జి. సుధాకర్ రెడ్డి, జి. శ్రీనివాస్, ఐలయ్య, ఎం.డి. కరీముల్లా, వి. రాజేందర్, డి. శ్రీనివాస్, పి. శ్రీనివాస్, సదయ్య, కాపు కొమరయ్య, క్యాథరాజు సతీష్, కేటీపీపీ కోల శ్యామ్, గోవిందుల తిరుపతి, మని సాగర్, లింగయ్య, కాసర్ల రాజయ్య, సంఘం శ్రీను పాల్గొన్నారు.






