30 August, 2026 | 4:34 PM

సమాజానికి పవన్ కుమార్‌ సేవలు చాలా అవసరం

30-08-2026 04:03 PM

కరీంనగర్ క్రైమ్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన వేడుక అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. పవన్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పవన్ కుమార్ ఎప్పుడూ నిబద్ధతతో పనిచేసే మంచి అధికారి అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మిగిలిన జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడవాలని మనసారా దీవించారు.

ఉద్యోగం నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు.. కానీ సమాజానికి, ముఖ్యంగా మన కరీంనగర్ ప్రాంతానికి ఆయన సేవలు మున్ముందు కూడా చాలా అవసరం అని గంగుల స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక మంచి అధికారి విరమణ పొందుతుంటే తోటి ఉద్యోగులకు బాధ అనిపిస్తుందని, కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఆయన పూర్తి సమయం తమతో ఉంటాడనే సంతోషం ఉంటుందని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు జిల్లా అధికారులు, పవన్ కుమార్ తోటి సహోద్యోగులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.