04-12-2025 12:00:00 AM
ఘట్‌కేసర్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యా దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా అవుషాపూర్ క్యాంపస్లోని ప్రభుత్వ హైస్కూల్, ఘట్ కేసర్ లోని శ్రీచందన టెక్నో స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక వ్యవసాయ ప్రదర్శన, క్షేత్రసందర్శనంను ఏర్పాటు చేశారు. 200 మందికి పైగా స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, భారత వ్యవసాయ అభివృద్ధి వివిధ కోణాలను అన్వేషించారు. ఇది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు.
ఈ సందర్భంగా అనురాగ్ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ కళాశాలలో స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో పొందిన పురోగతిని విద్యార్థులకు పరిచయం చేస్తూ, వ్యవసాయ రంగంలో వృత్తి, నైపుణ్యం పై ఆసక్తిని పెంపొందించడం మరియు భవిష్యత్తు లక్ష్యంగా ఈ వసాయ ప్రదర్శన, క్షేత్రసందర్శనం జరిగింది. సభను ఉద్దేశించి మాట్లాడిన వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ పి. నారాయణరెడ్డి, డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన ప్రసిద్ధమైన మాటలను గుర్తు చేశారు.
వ్యవసాయం విఫలమైతే మిగతా అన్నీ విఫలమవుతాయి. ఆయన వ్యవసాయం దేశ అభివృద్ధికి, స్థిరత్వానికి ఎంత ముఖ్యమో వివరించారు. వివిధ రకాల పండ్ల తోటలు, అరుదైన పండ్లు, మ్యూజియం, పోలీ హౌస్లు వంటి విభాగాలను సందర్శించారు. పంటలు, ఔషధ మొక్కలు, అరుదైన పండ్ల వైవిధ్యం చిన్నారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో అందరూ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.