విద్యార్థుల ప్రతిభకు వేదికగా “ది గ్రేట్ ఇంగ్లీష్ గాలా”
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు “ది గ్రేట్ ఇంగ్లీష్ గాలా” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై ఆసక్తిని పెంపొందించడమే కాకుండా వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరచేందుకు దోహదపడింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఇంగ్లీష్ ప్రసంగాలు, కథలు, కవితా పఠనం, నాటికలు తదితర కార్యక్రమాలను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.
విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా సాగడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు.
విద్యార్థులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయం అని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణప్రియ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వేదికపై మాట్లాడే ధైర్యం పెంపొందించుకోవడంతో పాటు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




