10 March, 2026 | 8:39 PM

హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత

10-03-2026 07:04 PM

మంగపేట,(విజయక్రాంతి): హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత పాటిస్తే సురక్షిత ప్రయాణాలు సాగించవచ్చని ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్ సూరి అన్నారు. మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్ సూరి ఆధ్వర్యంలో ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లిలో డ్రగ్స్, రోడ్డు భద్రతపై స్థానికులకు, వాహనదారులకి మంగళవారం అవగాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి మాట్లాడుతూ... సాధారణంగా అతి వేగం, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ తో విలువైన ప్రాణాలు కోల్పోవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని  సూచించారు. రోడ్డు భద్రత నియమాలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. బైక్ రేసింగ్లు చేయరాదని, లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపరాదని, వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించరాదని అన్నారు.

కార్లు తరహా వాహనాలలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించి రక్షణ పొందాలని సూచించారు. ప్రయాణాలు చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని, రోడ్డుకు ఎడమ వైపు ప్రయాణించాలని సూచించారు.  చాలా మంది చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి,మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.