17-02-2026 12:00:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వేగంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం తో భారత్ అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 45కు పైగా దేశాల మంత్రుల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సమావేశాల నుంచి భారత్ ఏం కోరుకుంటుందనేది పరిశీలించాల్సిన అవసరముంది. ఏఐకి మంచి డిమాండ్ ఉన్న మార్కెట్లలో అమెరికా, చైనాల తర్వాతి స్థానం భారత్‌దే.
అమెరికా కంపెనీలకు ఇప్పటికే చైనా తలుపులు మూసుకుపోయాయి. దీంతో భారత్‌లో ఏఐ వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ జనాభా దృష్ట్యా టెక్ కంపెనీలకు భారీ ఆదాయం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవలే బడ్జెట్‌లోనూ భారత ప్రభుత్వం దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏఐ సాంకేతికతకు డేటా అత్యంత కీలకం. ఈ డేటా ఆధారంగానే ఏఐ తనని తాను మెరుగుపరుచుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాలో 20 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత్‌లో ఏకంగా 700 మిలియన్ మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. భారతదేశ శాస్త్ర సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తాజా ఏఐ సమ్మిట్ బాగా ఉపయోగపడనుంది. ‘ఇండియా ఏఐ మిషన్’ ద్వారా రూపొందించిన 12 సరికొత్త ఏఐ వ్యవస్థలను ఈ వేదికపై ఆవిష్కరించనున్నారు. ఇవి ఇంగ్లీష్‌తో పాటు తెలుగు సహా దేశంలోని 22 అధికారిక భాషల్లో అద్భుతంగా పని చేయనున్నాయి.
ఈ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయ రంగంలో రైతులకు మేలు కలగడమే కాకుండా, విద్యార్థులకు సులభంగా పాఠాలు బోధించడం, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న వాదనను పక్కన పెడితే, రాబోయే ఐదేళ్లలో ఐటీ కంపెనీలకు కింది రంగాల్లో భారీ ఆదాయం సమకూరనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో భారత ఐటీ రంగం రూపురేఖలు మారిపోనున్నాయి.
దశాబ్దాల క్రితం రూపొందించిన పాత సాఫ్ట్‌వేర్ కోడ్‌ను ఆధునిక భాషల్లోకి మార్చడం గతంలో చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు ఏఐ సాయంతో ఈ కోడ్‌ను వేగంగా విశ్లేషించి, తప్పులు లేకుండా ఆధునీకరించడం వల్ల భారత ఐటీ సంస్థలకు భారీ ప్రాజెక్టులను తెచ్చిపెట్టనుంది. అయితే ఏఐలో భారత్‌ను వృద్ధి పథంలో నడిపించేందుకు మరిన్ని సంస్కరణలు జరగాల్సిన అవసరముంది.
భారత ప్రభుత్వం, ప్రైవేటు రంగం ఉమ్మడిగా ఆర్ అండ్ డీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. ఇందుకోసం విదేశాల నుంచి డాలర్ల రూ పంలో మూలధనం భారీగా కావాలి. అందుకు భారత్‌లో మరిన్ని ఏఐ సమ్మిట్‌లు జరిగేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఏఐతో లాభాలున్నప్పటికీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏఐ రాకతో ఉద్యోగాలకు ముప్పు అనే మాట బాగా వినిపిస్తుంది.
ఎంట్రీ, మధ్యస్థ, వైట్ కాలర్ ఉద్యోగాల తొలగింపు గురించి ఈ మధ్య ఎడతెరిపి లేని చర్చ జరుగుతున్నది. అంతేకాదు ఏఐ టెక్నాలజీ మానవుడు ఆపరేట్ చేసే పరిస్థితి ఉండడంతో అది సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లి ప్రమాదాలు పెరిగేందుకు అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏ రంగాల్లో ఏఐ అవసరం, ఏ రంగంలో అవసరముండదన్న దానిపై లోతైన అధ్యయనం అవసరం.