calender_icon.png 14 November, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీరు మారని ఎమ్మార్వో కార్యాలయం

14-11-2025 05:03:56 PM

ఇల్లంతకుంట ఎమ్మార్వో ఆఫీసులో దస్తావేజు లేఖరుల హవా

ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఇదే తంతు

ఇల్లంతకుంట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇల్లంతకుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో దస్తావేజు లేఖరులు తమ హవా నడిపిస్తున్నారు. ప్రతి పనికో రేటు అన్నట్టు ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయం తయారయ్యింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి సామాన్యులు వెళ్తే మీరు ఎందుకు వచ్చారు అనే సిబ్బంది, దస్తావేజు లేఖరులు వస్తే సప్పుడు చేయడం లేదు. భూ భారతి లో సామాన్యుడు స్లాట్ బుక్ చేసుకుని వెళ్తే ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదు అంటూ తిప్పుతున్న వైనాలు ప్రతి రోజు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

అదే పని ఒక దస్తావేజు లేఖరికీ అప్పగిస్తే క్షణాల్లో పని అవుతుండడం, మేము వెళ్తే కొర్రీలు పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సారును కలవాలంటే వేచి చూడక తప్పట్లేదని, మేము స్లాట్ బుక్ చేస్తే సాయంత్రం అయిన మా పని కావట్లేదని, అదే బ్రోకర్లతో వెళ్తే వెంటనే పని అవుతుందని ఆరోపణలు చేస్తున్నారు. కొందరు కింది స్థాయి సిబ్బంది కంటే దస్తావేజు లేఖరులకే కార్యాలయంలో ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారని వాపోతున్నారు. మీకు పాస్ బుక్ లేదని, లేదంటే మీ భూమి పైన అభ్యంతరాలు ఉన్నాయని, మీకు పది గుంటల లోపు భూమి రిజిస్ట్రేషన్ ఉంటే సారు చేయరని, ఏదో ఒక సాకు చెపుతూ సారుకు ఇంత ఇవ్వాలని ముందే మాట్లాడుకున్నాకే స్లాట్ బుక్ చేస్తున్నారు.

స్లాట్ బుక్ చేసుకున్న సమయం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో దస్తావేజు లేఖరులు ఎందుకు వస్తున్నారని అడిగిన కూడా, వాళ్లు ఇక నుండి రారని చెప్పి కొన్ని రోజుల పాటు కార్యాలయానికి రానివ్వకుండా సక్రమంగా నడిపించారు, కానీ ఇప్పుడు వారు లేనిదే పని ముందుకు సాగట్లేదు. దస్తావేజు లేఖరులు తహశీల్దారు కార్యాలయంలో ఎక్కువ సమయం గడుపుతుండడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. భూ భారతి ఆపరేటర్ చుట్టూ నిలబడి దస్తావేజు లేఖరులు దగ్గరుండి పనులు చేపిస్తూ, ఆపరేటర్ కు ఇబ్బంది అవుతుందని కొన్ని సార్లు వీళ్ళే ఫోటోలు తీస్తూ, వేలిముద్రలు, సంతకాలు చేపిస్తూ,  కొన్ని సార్లు పేపర్లు ప్రింటు తీసి, పత్రాలను స్కాన్ చేస్తుంటే, మీరెందుకు చేపిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాకు ఎమ్మార్వో చెప్పాడని, ఆ పని మేమే చేయాలి అంటూ దస్తావేజు లేఖరులు చెప్పడం హాస్యాస్పదం.

ఎవరైన సొంతంగా స్లాట్ బుక్ చేసుకుని వస్తే, ఈ డాక్యుమెంట్ ఎవరు బుక్ చేసారని అడుగుతున్న భూ భారతి ఆపరేటర్, సర్వర్ రావట్లేదని వారిని సాయంత్రం వరకు వేచి ఉండమంటున్నాడని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనల వల్ల తహసీల్దార్ పై ఏదో మతలబు ఉందని మండల ప్రజలు గుసగుసలు పెడుతున్నారు. అయితే గతంలో దీనిపై విజయక్రాంతి పత్రికలో వార్త వచ్చిన కూడా ఏదో తూతూ మంత్రంగా కొద్దిరోజులు బ్రోకర్లను దూరం పెట్టిన తహశీల్దార్, తర్వాత షరా మామూలే అన్నట్టుగా తమ పనిని కొనసాగిస్తున్నారు. ఈ దస్తావేజు లేఖరులు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఇల్లంతకుంట మండల తహశీల్దార్ కార్యాలయాన్ని తమకు అనుకూలంగా మార్చారు.

దీనికి తోడు ఓ కింది స్థాయి అధికారి షాడో తహశీల్దార్ పెత్తనం చెలాయించడం కొసమెరుపు. రిజిస్ట్రేషన్లు అయిపోయిన రోజు పరిపాటిగా బ్రోకర్లు తమ రోజువారి మామూళ్లు సాయంత్రం వేళ భూ భారతి ఆపరేటర్ తో సంప్రదింపులు జరిపి ఇస్తుండటంతో వారు కూడా ఎటువంటి కొర్రీలు లేకుండా పనులు చేస్తున్నారు. ఎవరైనా విలేకరులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తే ఈ దస్తావేజు లేఖరులు అక్కడి నుండి పరారు అవుతున్నారు. ఏది ఏమైనా ఇటువంటి పైరవీకారులు, బ్రోకర్లకు పెద్దపీట వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.