21 June, 2026 | 1:31 AM

లెబనాన్‌పై వైమానిక దాడులు

21-06-2026 12:15 AM
  1. ఇద్దరు చిన్నారులతో సహా తొమ్మిది మంది మృతి
  2. నెతన్యాహు తెలివితో నిర్ణయం తీసుకోవాలి: ట్రంప్

బీరుట్, జూన్ 20: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నానా తిప్పలు పడుతుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఆ ప్రయత్నాలకు గండికొడుతున్నారు. శనివారం దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. మొదట హిజ్బుల్లా గ్రూపులు ఐడీఎఫ్ దళాలపైకి 50 క్షిపణులను ప్రయోగించడంతో, వాటిని ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టాయి.

ఈ దాడుల నేపథ్యంలో మరోపక్క ఇజ్రాయెల్ కొంచెం తెలివి ఉపయోగించి, కాల్పుల విరమణకు అంగీకరించాలని ట్రంప్ సూచించారు. హిజ్బుల్లా తిరుగుబాటుదారులు, ఐడీఎఫ్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వెలువడిన కొన్ని గంటల్లోనే.. ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం.. వారం క్రితం జరిగిన అమెరికా ఒప్పందానికి ముప్పుగా మారే అవకాశం ఉంది.

ఈ దాడులు దక్షిణ పట్టణమైన నబాతియే, సమీప గ్రామాలపై జరిగాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. శిథిలాల కింద కనీసం ఏడుగురు చిక్కుకుపోయారని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో రాత్రికి రాత్రే హిజ్బుల్లా ఇజ్రాయెల్ దళాలపై 50కి పైగా క్షిపణులను ప్రయోగించిందని, దీంతో సైన్యం అక్కడి మిలిటెంట్ గ్రూపును లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించిందని ఐడీఎఫ్ సైనిక అధికారి ఒకరు తెలిపారు. బారిష్ గ్రామంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు మరణించారు. అరబ్ సలీం గ్రామంలో, ధ్వంసమైన ఇంటి నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. డూయిర్, కఫర్ రుమ్మన్ గ్రామాలలో జరిగిన డ్రోన్ దాడులలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి, ఒక లెబనీస్ సైనికుడు మరణించారు. 

ఇజ్రాయెల్.. సంయమనంతో మెలగాలి :ట్రంప్

కాల్పుల విరమణను ఉల్లంఘించి, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో ఆ దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం తెలివితో ప్రవర్తించాలని ఆదేశ ప్రధాని నెతన్యాహుపై ఫైర్ అయ్యారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని తాను స్వయంగా ఇజ్రాయెల్‌ను కోరానని ఓ మీడియాకు ఫోన్‌లో ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇజ్రాయెల్ తాజా దాడుల వల్ల శాంతి ఒప్పందానికి తన దౌత్య ప్రయత్నాలకు ప్రమాదంగా ఉందని ఆయన తెలిపారు.

ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. సంయమనం పాటించాలని వారిపై ఒత్తిడి చేశానని, ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఒప్పందం బెడిసికొట్టే ప్రమాదం ఉందని వాదించానని చెప్పారు. ప్రశాంతంగా ఉండాలని, కొంచెం బుర్ర వాడి నిర్ణయం తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. అయితే కాల్పుల విరమణ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో మాట్లాడారో లేదో మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఇజ్రాయెల్ మనుగడకు తన విదేశాంగ విధాన నిర్ణయాలు చాలా కీలకమని ట్రంప్ అభిప్రాయ పడ్డారు.