సర్‌పై అప్రమత్తం
- పేదల ఓట్లు పోతే.. వాళ్ల ఆధార్, రేషన్‌కార్డులు పోతయ్
- ప్రతి ఒక్కరూ కేర్‌ఫుల్‌గా ఉండాలి
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ బాధ్యత తీసుకోవాలి
- ఎస్‌ఐఆర్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించబోం
- నా వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి చిట్టా ఉంది
- ఇన్‌చార్జ్‌లు సర్‌ను పట్టించుకోకపోతే.. కొత్తవారిని నియమిస్తాం
- కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా పేదలు, బడుగు, బలహీనవర్గాలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సర్‌లో పేదల ఓట్లు పోతే వాళ్ల ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు పోతుందని, అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ బాధ్యత తీసుకోవాలన్నారు.
ఎవరైనా ఎస్‌ఐఆర్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించబోమని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ‘నా వద్ద నిర్లక్షంగా వ్యవహరిస్తున్న వారి చిట్టా ఉంది’ అని పార్టీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఇన్‌చార్జ్‌లు సర్‌ను పట్టించుకోకపోతే.. కొత్తవారిని నియమిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నుంచి రాష్ట్రంలో సర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ విషయంలో పార్టీ శ్రేణుల, బీఎల్‌ఏలు, సర్పంచ్‌లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షినటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, బీఎల్‌ఏలు, సర్పంచ్‌లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు ప్రతి అర్హత గల ఓటును కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇన్‌చార్జి మంత్రులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. ఎస్‌ఐఆర్ విషయంలో కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జిల్లాల వారీగా నిర్వహించిన అవగాహన సదస్సులకు చెందిన పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, ఎవరెవరు నిర్లక్ష్యం చేస్తున్నారో పేర్లతో సహా వెల్లడించగలనని, కానీ ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.
ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. సర్ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. పేదల ఓట్లు జాబితాల నుంచి తొలగిపోతే వారి హక్కులు దెబ్బతింటాయని, అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందన్నారు. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఎస్‌ఐఆర్ విషయంలో పార్టీ నిర్ణయాలను పట్టించుకోని ఇన్‌చార్జులను తొలగించి కొత్తవారిని నియమిస్తామని హెచ్చరించారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించబోమని కూడా స్పష్టం చేశారు. మరో పది రోజులు వేచి చూస్తామని, అప్పటికీ పనితీరులో మార్పు రానట్లయితే చర్యలకు ఉపక్రమిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో సర్పంచ్‌ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
అర్హత గల ప్రతి ఓటూ కాపాడాలి: మహేష్ కుమార్ గౌడ్
సర్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను గమనించాలని ఆయన పేర్కొన్నారు. బంగాల్‌లో టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడం వల్ల తీవ్ర నష్టం చవిచూసిందని తెలిపారు.
ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లౌకికవాద ఓట్లను లక్ష్యంగా చేసుకుని, కుట్రలు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అందుకే ప్రతి అర్హత గల ఓటును కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత కీలకపాత్ర పోషించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణతో ఓటరు జాబితాలను పరిశీలించాలన్నారు.
ఓటు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు: మీనాక్షి నటరాజన్
సర్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు చురుగ్గా పాల్గొనాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని ఆమె అభివర్ణించారు. ప్రజల ఓటును కాపాడాలని, నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణ ప్రజలకు సర్ మీద అవగాహన లేకపోవచ్చన్నారు. గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎలాగైతే ఏర్పాటు చేస్తామో.. ఇప్పుడు సర్ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలిసేలా చూడాలన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు టెంట్లు వేసుకుని 2002 ఓటర్ జాబితా, 2025 ఓటరు జాబితా పెట్టుకుని మ్యాపింగ్ చేయాలని సూచించారు.






