ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
25-06-2026 02:03 AM
ఇటిక్యాల, జూన్ 24: ఇటిక్యాల: మండలంలోని నక్కలపల్లి, కొత్త దేవరపల్లి, గ్రామాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద భద్రతా లోపాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆయా గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్లను సిమెంట్ దిమ్మెలపై ఏర్పాటు చేసినప్పటికీ, వాటి చుట్టూ రక్షణ కంచె (ఫెన్సింగ్) నిర్మించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కంచె లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే గ్రామాలలోని పశువులు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యే ముప్పు పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, తక్షణమే రక్షణ కంచెలు ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా ప్రమాదాలను నివారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






