25 June, 2026 | 2:34 AM

‘సర్’.. బేఫికర్

25-06-2026 01:53 AM

తెలంగాణలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

అత్యాధునిక సాంకేతికత వినియోగం.. నకిలీ ఓట్ల ప్రక్షాళన 

అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించే సంకల్పం

* సర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ప్రతిరోజూ ఇంటింటికీ  వెళ్తున్నారు. ఓటర్లకు  సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మరణించిన వారిని గుర్తించి, వారి ఓట్లను   తొలగిస్తున్నారు. అలాగే, నకిలీ ఓట్లను గుర్తించి  పరిహరిస్తున్నారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నవారికి, ఒకేచోట ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సేకరించిన వివరాలను  ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు.

ఓటు వజ్రాయుధం

భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పరమావధి. ఓటనేది పవిత్రమైన హక్కు. అది ప్రజాస్వామ్యాన్ని బతికించే ప్రాణవాయువు లాంటిది. ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్యానికి ప్రజలే అసలైన యజమానులు. సరైన ఓటు హక్కు కలిగిన ప్రజలే ఈ దేశాన్ని పరిపాలించే నాయకులను ఎన్నుకుంటారు. కాబట్టి, దేశాన్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించేందుకు ప్రతి ఒక్క అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. 

ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులకు తావు ఉండొద్దని, దొంగ ఓట్లకు అవకాశం ఉండొద్దని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిష్ఠాత్మకంగా ‘సర్’.. పేరిట ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చేపడుతున్నది. ఇప్పటివరకు రెండు విడతలు పూర్తి చేసిన ఈసీ, ఇప్పుడు మూడో విడతగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలి త ప్రాంతాల్లో (యూటీ) ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా కొనసాగిస్తున్నది.

ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్టుగానే, తెలంగాణలోనూ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు, అవకతవకలకు తావులేకుండా ఈసీ ప్రక్రియ చేపడుతున్నది. దీనిపై ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదని, ఎలాంటి భయాలూ పెట్టుకోవద్దని ఈసీ సూచిస్తున్నది. ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్తున్నారు. ఓటర్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మరణించిన వారిని గుర్తించి, వారి ఓట్లను తొలగిస్తున్నారు. అలాగే, నకిలీ ఓట్లను గుర్తించి పరిహరిస్తున్నారు.

రెండు చోట్ల ఓట్లు ఉన్నవారికి, ఒకేచోట ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటిక ప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. ఒకవేళ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, తప్పు లు ఉన్నవారు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను గడువులోపు ఓటర్ల నమోదు అధికా రుల (ఈఆర్వో)ను సంప్రదించి సవరించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. దేశంలో సుమారు రెండు దశాబ్దాలుగా సర్ చేపట్టలేదు. ఈసీ ఇప్పటికైనా సర్ చేపట్టినం దుకు మెజార్టీ ప్రజల నుంచి మద్దతు ఉంది. కొన్నిచోట్ల కొన్ని రాజకీయ పార్టీల నుంచి మాత్రం కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ వలసలకూ చెక్

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి భారతదేశంలో ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు దాటింది. వేగవంతమైన పట్టణీకరణ, వలసలు, జనాభా మార్పుల నేపథ్యంలో ఓట ర్ల జాబితా సమగ్రతను కాపాడటం ఎన్నిక ల సంఘానికి ఒక పెద్ద సవాలుగా మారిం ది. 20వ దశాబ్దం ఆరంభంలో చివరి సారి సర్ ప్రక్రియ జరిగింది. తర్వాత ఓటర్ల జాబితాల్లో ఒకే పేరుతో అనేకసార్లు నమోదవ్వడం, మరణించిన ఓటర్ల పేర్లు, నివా సాలు మారిన వారి వివరాలు అలాగే ఉం డటం పెద్ద తలనొప్పిగా మారింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సర్ ప్రక్రియ తలపెట్టింది. అలాగే, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే అక్రమ వలసలను అరికట్టేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావించి అమలు చేస్తున్నది. దేశ సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులు, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడినట్లు గుర్తించి, ఓటర్ల జాబితాలోనూ వారి పేర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని పరిహరిస్తున్నది. దీనిలో భాగంగానే ఇటీవల బిహార్, పశ్చిమ బంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రా ల్లో చేపట్టిన సర్ ప్రక్రియలో లక్షలాది అనుమానాస్పద ఓటర్లను ఈసీ తొలగించింది.

అలా బిహార్‌లో దాదాపు 65 లక్షల కు పైగా ఓటర్ల పేర్లను తొలగించింది. దేశవ్యాప్తంగా వలసొచ్చిన  బంగ్లాదేశీయులు కోటి నుంచి 2 కోట్ల వరకు ఉండవచ్చని గతంలో వివిధ ప్రకటనలు పేర్కొన్నప్పటి కీ, కచ్చితమైన గణాంకాలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వలసదారులు కూడా భారత్‌లో ఓటు హక్కు పొం దడం, ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుందనడం వాస్తవం. అక్రమ ఓట్లను తొలగింపు టార్గెట్‌గానే ఈసీ సర్ పక్కాగా చేపడుతున్నది.

కొన్నిపార్టీల నుంచి విమర్శల వెల్లువ

సర్ ప్రక్రియపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ మైనారిటీలు, వెనుకబడిన వర్గాల(బీసీల) ను లక్ష్యంగా చేసుకుని, వారి ఓట్లను తొలగించేందుకు పరోక్షంగా పౌరసత్వ పరీక్ష చేస్తుందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. వలస కార్మికులు, సరైన గుర్తింపు కార్డులు లేని పేదలు తమ ఓటు హక్కును కోల్పోతారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున, ఈ ప్రక్రియ అధికార పక్షానికి లబ్ధి చేకూర్చేలా ఉంటుందని కూడా వాదిస్తున్నాయి. అయితే, 2026 మే నెలలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సమర్థిస్తూ.. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు సర్ ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేసింది. ఈసీ కూడా వెంటనే ఓటర్ల నమోదు ఫారాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రక్రియకు అత్యాధునిక సాంకేతిక ప్రక్రి య వినియోగిస్తున్నది. ఎన్నికల సవరణ చట్టం 2021 ప్రకా రం ఓటరును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. సర్ నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయవచ్చు. వలస వెళ్లిన వారు రిమోట్ ఓటింగ్ పద్ధతి ద్వారా ఓటు వేసే అవకాశం కలుగుతుంది. గోప్యతా నియమాలను పాటిస్తూనే పారదర్శక గుర్తింపు సాధ్యమవుతుంది.

సర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఓటర్ల నమోదు ఫారాల పంపిణీ అత్యంత వేగంగా జరుగుతున్నది. ఉదాహరణకు.. మణిపూర్‌లో 98 శాతం కంటే ఎక్కువ ఫారాలను పంపిణీ పూర్తయిం ది. డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతమైంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే ఈసీ కొన్నిరాష్ట్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఆ జాబితాపై అభ్యంతరాలను సైతం స్వీకరించనున్నది. ఈ ఏడాది చివరి నాటికి ఓటర్ల తుదిజాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.

సర్ చరిత్ర

భారతదేశంలో సర్ ప్రక్రియ మూలాలు 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నాటికే ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కొత్తలో, అప్పటి కేంద్ర ప్రభుత్వం దాదాపు 17.3 కోట్ల మందిని ఓటర్లను నమోదు చేసింది. ఎన్నికల సంఘం ఏర్పాటైన తర్వాత దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టింది. ఆ తర్వాత వరుసగా 1957, 1961, 1965, 1966 లలో ముమ్మర సవరణలు జరిగాయి. ఈ ప్రక్రియలన్నీ ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తూ వచ్చాయి.

తర్వాత వార్షిక లేదా ఎన్నికల ముందస్తు సవరణలు కొనసాగినప్పటికీ, వనరుల కొరత కారణంగా సవరణకు బ్రేకులు పడ్డాయి. తర్వాత 1983, 1987, 1992, 1993, 1995లో వివిధ దశల్లో సవరణలు జరిగాయి. ఈ కాలంలోనే ‘ఓటర్ల ఫోటో గుర్తింపు’ (ఎపిక్) వంటి కీలక సంస్కరణలు వచ్చాయి. 2002 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ముమ్మర సవరణ జరిగింది. ఇందులో ఓటర్ల వివరాల ధ్రువీకరణతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు సంభవించాయి. తర్వాత, ఎన్నికల సంఘం ప్రధానంగా సంక్షిప్త సవరణల వైపు మొగ్గు చూపింది.

యేటా జనవరి 1వ తేదీని ప్రామాణిక తేదీగా తీసుకుని చేసే వార్షిక నవీకరణలు ఇవి. అయితే 2010, 2020 నాటికి వేగంగా పట్టణీకరణ, సరిహద్దుల గుండా వలసల కారణంగా లక్షలాది నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లు జాబితాల్లో ఉండిపోవడంపై ఆందోళనలు పెరిగాయి. ఆధార్ అనుసంధాన పైలట్ ప్రాజెక్టులు కొన్ని న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నప్పటికీ, 2021లో వీటికి చట్టబద్ధమైన మద్దతు లభించింది. ఆధునిక సర్ పునరుద్ధరణ ప్రక్రియ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2025లో బిహార్‌లో ప్రారంభమైంది. విడతల వారీగా అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది.

2026 నాటికి సర్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. గత రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఇటువంటి ముమ్మర ధ్రువీకరణ జరగకపోవడాన్ని ఎన్నికల సంఘం ప్రధాన కారణంగా చూపుతున్నది. సుప్రీంకోర్టు దీనికి ఆమోదం తెలపడంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగినప్పటికీ, రాజకీయంగా, అమలు చేసే విషయంలో చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి