10 July, 2026 | 9:46 PM

న్యాయవాదిపై అక్రమ కేసులను ఖండించిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్

10-07-2026 08:34 PM

దమ్మపేట, జూలై 10(విజయ క్రాంతి): న్యాయవాది గోళ్ల భవాని కృష్ణ యాదవ్ పై దమ్మపేట పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాష్ట్ర ప్రతినిధులు ఖమ్మం, హైదరాబాద్ నుండి దమ్మపేటకు వచ్చి రైతుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, పేద రైతుల భూ హక్కుల పరిరక్షణ కోసం అడ్వకేట్ భవాని కృష్ణ యాదవ్ చేస్తున్న న్యాయ పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని, భూ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అలాగే, రైతులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేపట్టే ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన కార్యక్రమాలకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లేందుకు కూడా తమ సంఘం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. 

కార్యక్రమంలో సీపీఎం నాయకులు దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, కొలికపోగు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్  రాష్ట్ర నాయకులు కొల్లి సత్యనారాయణ, ఏడునూతల శ్రీనివాసరావు, జలసూత్రం శివరాం ప్రసాద్, జక్కంపూడి నాగేశ్వరరావు, ఉడతనేని శ్రీనివాసరావు, మారం సతీష్, దర్గా వాలి, అరుణ తదితరులతో పాటు దమ్మపేట బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.