10 July, 2026 | 10:52 PM

ముగ్గురు పిల్లలతో గృహిణి ఆత్మహత్యాయత్నం

10-07-2026 09:42 PM

- కాపాడిన పోలీసులు

సిద్దిపేట క్రైం: కుటుంబ కలహాల  కారణంగా మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు తన ముగ్గురు పిల్లలు సహా ఆత్మహత్యకు యత్నించింది. సమయానికి చేరుకున్న పోలీసులు ఆ నలుగురి ప్రాణాలు కాపాడారు. రాయిపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితకు తన అత్తతో గొడవ జరిగింది. దాంతో మనస్తాపం చెందిన వివాహిత, ఏడేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, సమీపంలోని ఒక బావి వద్దకు వెళ్ళింది. ఇది గమనించిన గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వెంటనే అప్రమత్తమై 'డయల్ 100' ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే కానిస్టేబుళ్లు ఎన్.ప్రశాంత్, మల్లేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ, ముగ్గురు పిల్లలను  కాపాడారు. కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్  అభినందించారు.