నవంబర్‌లో తగ్గిన వాణిజ్య ఎగుమతులు పసిడి దిగుమతుల్లో ఆల్‌టైం రికార్డు!
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్య ఎగుమతులు నవంబర్‌లో తగ్గుముఖం పట్టాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే 4.85శాతం మేర క్షీణించాయి. గతేడాది ఇదే సమయంలో 33.75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది 32.11 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి.
ఇక దిగుమతుల విషయానికి వస్తే.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈసారి 27శాతం మేర పెరుగుదల నమోదైంది. గత నవంబర్‌లో 55.06 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు.. ఈ నవంబర్‌లో 69.95 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. అలాగే, పసిడి దిగుమతులు 14.8 బిలియన్ డాలర్లతో ఆల్‌టైం రికార్డు నమోదు చేశాయి.
ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం కారణంగా వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్‌లో దేశం నుంచి సరుకుల ఎగుమతులు 17.25 శాతం పెరిగి 39.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31 బిలియన్ డాలర్లకు చేరగా.. దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నాయి.




