13 March, 2026 | 4:05 AM

సరిపడా యూరియా కేటాయించండి

13-03-2026 01:28 AM

కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): రాబోయే ఖరీఫ్-- 2026 వ్యవసాయ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే మూడు నెలలు అయిన ఏప్రిల్, మే, జూన్‌లకు ప్రతి నెల 2.00 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్ర భుత్వాన్ని కోరారు.

ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు గురువారం లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఖరీఫ్- 2026 సీజన్ ప్రారంభానికి యూరియా ప్రారంభ నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఉండవచ్చని మంత్రి తెలిపారు.   రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 70 శాతం పంటలు ఖరీఫ్ సీజన్‌లోనే సాగు అవుతాయని మంత్రి తెలిపారు.

ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు ఈ సీజన్‌లో విస్తృతంగా సాగు చేయబడతాయి. ఈ పంటలకు అధిక మొత్తంలో యూరియా అవసరం ఉంటుందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ముందుగానే తగిన నిల్వలు సిద్ధం చేయడం ద్వారా రైతులకు ఎరువుల కొరత లేకుండా సరఫరా చేయవచ్చని ఆకాంక్షించారు.