14 April, 2026 | 3:09 AM

మహా దార్శనికుడు అంబేద్కర్

14-04-2026 12:48 AM
  1. ఆయన ప్రపంచ మేధావి
  2. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతికి అంబేద్కర్ కృషిని, ఆయన చేసిన సేవల ను కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం, వర్ణ కుల మత లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ అని కేసీఆర్ అన్నారు.

అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, దేశ ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ కృషి మహోన్నతమైనదని అన్నారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఆశయాల సాధనకోసం మొదటి పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని గుర్తు చేశారు.

నూతన  రాష్ట్రంలో  అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకుని, రాష్ట్ర పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుం టూ, వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, రేపటి తరాలో నిత్య చైతన్యం కలిగించేందుకు, దేశంలో మరే రాష్ట్రం ఏర్పాటు చేయని విధంగా, ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ ప్రతి రూపాన్ని, విగ్రహం రూపంలో హైద్రాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నామన్నారు.