6 May, 2026 | 6:22 PM

రైతులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యం

06-05-2026 05:47 PM

- రైతు వారోత్సవాల్లో ఏఎంసి  చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి

గజ్వేల్: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆధునిక సౌకర్యాలను చేరువ చేయడం ప్రభుత్వ లక్ష్యమని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏఎంసి  ఆధ్వర్యంలో  99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ, రైతులకు తక్కువ వడ్డీకే పంట రుణాలు అందేలా బ్యాంకులతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామన్నారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ రైతులకు మరింత ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. గంటకు 3 నుంచి 4 టన్నుల ధాన్యాన్ని శుభ్రపరిచే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ పనితీరును రైతులకు ప్రదర్శించారు.

శాస్త్రీయ గోదాములు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల వినియోగంపై వివరించారు. రైతు బంధు సహా ప్రభుత్వ పథకాల లబ్ధిని రైతులు పొందాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రాథమిక సహకార సంఘాల ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.