15 August, 2026 | 5:28 PM

స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థుల సందడి

15-08-2026 04:39 PM

కొండపాక, ఆగస్టు 15: కొండపాక మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శాంభవి మోడల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భరతమాత,మహాత్మా గాంధీ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, కోలాటం తదితర ఆటపాటలతో ఉత్సాహభరితంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి గీతాలతో సాగిన ర్యాలీతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ప్రతిభను చూసి స్థానికులు అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు దేశభక్తి, జాతీయ సమైక్యత సందేశాన్ని చాటిచెప్పాయి.