బ్లూచిప్ కంపెనీల్లో షా పెట్టుబడులు
గాంధీనగర్, ఏప్రిల్ 22: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పలు లిస్టె డ్ కంపెనీల్లో వాటాలు ఉన్నట్టు తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ అఫిడవిట్ ప్రకారం షా 180 లిస్టె డ్ కంపెనీల్లో పెట్టుబడి చేశారు. ఆ పెట్టుబడుల విలువ ప్రస్తుతం రూ. 17.4 కోట్లు. అందులో హిందుస్థాన్ యూనీలీవర్ (రూ.1.4 కోట్లు), ఎంఆర్‌ఎఫ్ (రూ.1.3 కోట్లు), కాల్గేట్ పామోలివ్ (రూ.1.1 కోట్లు), ప్రొక్టర్ అండ్ గాంబల్ హైజీన్ (రూ.0.96 కోట్లు), ఏబీబీ ఇండియా (రూ.0.7 కోట్లు) తదితర బ్లూచిప్ కంపెనీల షేర్లు అమిత్ షా వద్ద ఉన్నాయి.
ఆయన పెట్టుబడి చేసిన కంపెనీల జాబితాలో ఐటీసీ, వీఐపీ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కుమ్మి న్స్ ఇండియా తదితరాలు ఉన్నాయి. అలాగే షా సతీమణి సోనాల్ అమిత్‌బాయ్ వద్ద సైతం 80 లిస్టెడ్ కంపె నీల్లో రూ.20 కోట్ల షేర్లు ఉన్నాయి. అందులో సన్‌ఫార్మా, కరూర్‌వైశ్యా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, కెనరా బ్యాంక్ తదితరాలు ఉన్నాయి. షా దంపతుల మొత్తం స్థిర, చరాస్తులు రూ.65,67 కోట్లుకాగా, అందులో దాదాపు సగభాగం స్టాక్ పెట్టుబడుల్లోనే ఉండటం గమనార్హం.






