15 July, 2026 | 6:14 AM

రిలయన్స్ ఆదాయం రూ. 2.4 లక్షల కోట్లు

23-04-2024 01:45 AM

టెలికం, రిటైల్ వ్యాపారాల తోడ్పాటు ‘వ్యాపారాలన్నీ మంచి ఆర్థిక, నిర్వహణా పనితీరును ప్రదర్శించాయి. దీంతో రిలయన్స్ పలు మైలురాళ్లను చేరింది. రిలయన్స్ ఒక ఏడాదిలో రూ.1 లక్ష కోట్లకు మించి పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించిన తొలి భారతీయ కంపెనీగా నమోదయ్యిందని తెలియపర్చడానికి సంతోషిస్తున్నా. చందాదారుల బేస్ పెరగడంతో డిజిటల్ వ్యాపారం వృద్ధి సాధిస్తున్నది. జియో 5జీ కస్టమర్ల సంఖ్య 10.8 కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్  స్టోర్స్‌ను రీమోడల్ చేయడం ద్వారా వినియోగదారులకు అపారమైన చాయిస్‌లను ఎంచుకునే సౌలభ్యాన్ని, మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తాం’

 ముకేశ్ అంబానీ చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్

నికరలాభంలో 2% క్షీణత

షేరుకు రూ.10 డివిడెండు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: టాప్ బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని మించినప్పటికీ, నికరలాభం స్వల్పంగా క్షీణించింది. ఆదాయం 11 శాతం పెరిగింది. 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో ఆర్‌ఐఎల్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రూ.19,299 కోట్ల నుంచి రూ.18,951 కోట్లకు తగ్గింది. వివిధ విశ్లేషకులు, బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ లాభం రూ.18,300 కోట్ల సమీపంలో ఉంటుందని అంచనా వేశాయి.  సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధిచెంది రూ.2.16 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. క్యూ4లో ఆపరేటింగ్ లాభం మాత్రం పటిష్ఠంగా 14 శాతం వృద్ధిచెంది రూ.47,150 కోట్లకు పెరిగింది.

ఆపరేటింగ్ మార్జిన్ సైతం 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 17.8 శాతానికి చేరింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇబిటా 47.5 శాతం పెరిగి రూ.5,606 కోట్లకు చేరింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి పెరగడంతో ఈ వ్యాపారంలో ఇబిటా భారీగా వృద్ధిచెందింది. ఆర్‌ఐఎల్ ప్రధాన వ్యాపారమైన ఆయిల్, పెట్రోకెమికల్స్ రికవరీకావడం, టెలికం, రిటైల్ వ్యాపారాలు వృద్ధిబాటలో కొనసాగడంతో రికార్డు ఆదాయాన్ని సాధించగలిగింది.  2023 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే నికరలాభం 10 శాతం, ఆదాయం 6 శాతం చొప్పున పెరిగాయి. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2023 ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.10 చొప్పున రెండవ డివిడెండును సిఫార్సుచేసింది. 

రూ.10 లక్షల కోట్ల టర్నోవర్ సాధించిన తొలి కంపెనీ

ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్ల టర్నోవర్ సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ నమోదయ్యింది. 2022 కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2.6 శాతం వృద్ధితో రూ.9.74 లక్షల కోట్లకు చేరింది. అలాగే ఒక ఏడాదిలో రూ.1 లక్ష కోట్లకు మించి పన్ను ముందు లాభాన్ని (పీబీటీ) సాధించిన తొలి కంపెనీగా సైతం ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది.  పూర్తి ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ నికరలాభం రూ.66,702 కోట్ల నుంచి రూ.69,621 కోట్ల రికార్డుస్థాయికి చేరింది. 

రూ.3.24 లక్షల కోట్లకు చేరిన రుణాలు

తమ రుణాలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.3.11 లక్షల కోట్లు ఉండగా, మార్చి చివరినాటికి రూ.3.24 లక్షల కోట్లకు పెరిగినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. చేతిలో ఉన్న నగదు నిల్వలు పోను రూ.1.16 లక్షల కోట్ల నికర రుణం ఉన్నదని పేర్కొంది. 

జియో లాభం రూ.5,337 కోట్లు

దేశంలో ప్రధాన టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికరలాభం మార్చితో ముగిసిన క్యూ4లో 13 శాతం వృద్ధితో రూ. 5,337 కోట్లకు చేరింది. ఈ లాభం దాదాపు విశ్లేషకుల అంచనాలకు దగ్గరగా ఉన్నది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.4,717 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023 డిసెంబర్ క్వార్టర్లో రూ. 5,208 కోట్ల లాభాన్ని సంపాదించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో జియో స్టాండె         లోన్ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 23,394 కోట్ల నుంచి రూ.25,959 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జియో  నికరలాభం రూ. 20,466 కోట్లకు, ఆదాయం రూ. 1,00,577 కోట్లకు పెరిగింది. జియో చందాదారుల సంఖ్య 48.1 కోట్లకు పెరిగింది. క్యూ4లో డేటా ట్రాఫిక్ అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 38.1 బిలియన్ల జీబీ నుంచి 40.9 బిలియన్ల జీబీకి పెరిగింది. జియో పూర్తి సంవత్సరంలో రూ.21,424 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 

రిటైల్ లాభం రూ.2,698 కోట్లు

రిలయన్స్ రిటైల్ వ్యాపారం నికరలాభం 11.7 శాతం వృద్ధితో రూ.2,698 కోట్లకు పెరిగింది. స్టోర్ల సంఖ్యను 18,774 నుంచి 18,836 కు పెంచుకుంది. అయితే జనవరి త్రైమాసికంలో 2023 డిసెంబర్‌తో పోలిస్తే స్టోర్స్ సందర్శకుల సంఖ్య 28.2 కోట్ల నుంచి 27.2 కోట్లకు తగ్గింది. కానీ గత ఏడాది క్యూ4లో నమోదైన 21.9 కోట్లతో పోలిస్తే సందర్శకులు గణనీయంగా పెరిగారు.