4 July, 2026 | 2:14 AM

విధేయతకు పట్టం

04-07-2026 01:30 AM
  1. పినపాక కాంగ్రెస్ పగ్గాలు పేరంకు 
  2. పినపాక మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియామకం
  3. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సేవలకు గుర్తింపు
  4. వివాదరహిత నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు
  5. విజయక్రాంతి కథనంతో స్పందించిన అధిష్టానం

పినపాక, జులై 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విధేయత, నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నమ్మిన అనుచరుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడు పేరం వెంకటేశ్వరరావు ను పినపాక మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకంతో మండల కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పదవులతో సంబంధం లేకుండా పార్టీ సేవలోనే..

పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన పేరం వెంకటేశ్వరరావు సేవలకు గుర్తింపుగానే ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించారు.

అహర్నిశలు పార్టీ కోసం శ్రమించిన నాయకుడు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని వీడకుండా ప్రతి ఉద్యమం, ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలకు అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేషంగా శ్రమించారు.  కష్టకాలంలోనూ పార్టీకి అండగా నిలవడం వల్లే అధిష్ఠానం ఆయన సేవలను గుర్తించి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పార్టీ బలోపేతమే లక్ష్యం

నియామకం అనంతరం పేరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. టీపీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.