భావోద్వేగానికి గురిచేసే మూర్తి
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు కథ, కథనం అందించి దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు బుధవారం మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “పాతికేళ్ల కుర్రాడి కథ చెప్తే రొటీన్ అవుతుందని, కొత్తగా ఉండాలనుకొని ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథ రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితేనే బాగుంటారని ముందే అనకున్నా. ఎమోషన్స్ బాగా పండిస్తారనే ఆయన్ని ఎంచుకున్నాను. చాందినీ చౌదరి చేసిన ‘అంజన’ పాత్రతోనే సినిమా ప్రారంభమవుతుంది. అంజన వల్ల మూర్తి జీవితంలో వచ్చిన మార్పులే సినిమాను ముందుకు నడిపిస్తాయి.
అంజన క్యారెక్టర్‌లో ఆమె బాగా చేసింది. సంగీత నేపథ్యంలో రానున్న ఈ సినిమా కోసం కొంత పరిశోధన జరిపి అప్పటి తరం సంగీతం, ఇప్పటి ట్రెండీ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. పవన్ మంచి సంగీతాన్నిచ్చారు. బడ్జెట్ అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువే అయినప్పటికీ నా స్నేహితులే నిర్మాతలైనందు వల్ల ఎలాంటి సమస్య రాలేదు. చిత్రీకరణ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్, ప్రమోషన్స్ కష్టంగా అనిపించింది. కంటెంట్, ఎమోషన్స్ బలంగా ఉంటే విజయం తథ్యం. మా సినిమాపై మాకు ఆ నమ్మకం ఉంది” అని తెలిపారు. ముక్తయింపుగా “ఏదో సందేశం ఇవ్వాలని కాదు కానీ, పాతికేళ్ల వయసులో సాధించలేనిది, యాభై ఏళ్ల వయసులో సాధించాలనుకున్నప్పుడు ఆ ప్రయాణం ఎంత భావోద్వేగ పూరితంగా ఉంటుందో చెప్పాలనుకున్నాను‘’ అంటూ ముగించారు.






