తప్పుల్లేని ఓటర్ జాబితానే ఎస్ఐఆర్ లక్ష్యం.!
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, తప్పులను సరిచేసి ఖచ్చితమైన ఓటర్ జాబితా రూపొందించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. గురువారం పెద్దకొత్తపల్లి మండలం వెన్నిచర్లలో ఎస్ఐఆర్‌లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లతో నిర్వహించిన హియరింగ్‌ను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
ఓటర్ల ఆధారాలు, అభ్యంతరాలను పరిశీలించి, ఒక ఓటరు వివరాలను యాప్‌లో స్వయంగా అప్‌లోడ్ చేశారు. గ్రామంలోని మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,010 మంది ఓటర్లు ఉండగా, చిన్నపాటి తప్పుల సవరణ కోసం 43 మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు తొలగిపోకూడదని, అనర్హుల వివరాలు కొనసాగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని, తప్పులుంటే ఆధారాలతో సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో బన్సీలాల్, బీఎల్వోలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.






