30 July, 2026 | 6:50 PM

డబ్బు కోసమే వృద్ధురాలి హత్య

25-08-2024 01:25 AM
  1. వనస్థలిపురంలో వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు 
  2. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్టు

ఎల్బీనగర్, ఆగస్టు 24: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన డోంబు బోత్రా అలియాస్ డుము (30) స్వగ్రామంలో పనిలేకపోవడంతో తెలిసిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు వచ్చి వనస్థలిపురంలోని శ్రీకృష్ణకాలనీలో ఉంటూ సెంట్రింగ్ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అలాగే వనస్థలిపురంలోని శ్రీకృష్ణన గర్ కాలనీలో చీమల బాలమ్మ(63) కుటుం బ సభ్యులతో కలిసి ఉంటూ కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నది.

బాలమ్మ అప్పుడప్పుడు డబ్బులు లెక్కపెడుతూ ఉండగా బోత్ర చూసేవాడు. ఆమె దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని.. ఎలాగైనా వాటిని తస్కరించాలని నిర్ణయించుకున్న డుము.. ఈనెల 5న అర్థరాత్రి ప్రాంతంలో బాలమ్మ ఇంట్లోకి వెళ్లి బండరాయితో ఆమె తలపై కొట్టి చంపి.. రూ.8వేల నగదు, 7 తులాల వెండి ఆభరణాలను తీసుకుని పారిపోయాడని పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా హత్య జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోని ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

ఈ క్రమంలో శనివారం నిందితుడుడుమును అరెస్టు చేసి అతడి నుంచి ఏడు తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు డుము ఒడిశాలోని నబరంగపూర్‌లో ఒక కేసులో జైలుకు వెళ్లాడని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులను రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు. డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కాశిరెడ్డి పర్యవేక్షణలో సీఐ అశోక్‌రెడ్డి, పోలీసులు గౌరునాయుడు, అనిల్‌కుమార్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు నారాయణ, జగన్, వెంకటరాములు, మల్లికార్జున్ తదితరులు మహిళ హత్య కేసును ఛేదించినవారిలో ఉన్నారు.